హైదరాబాద్‌లో దారుణ ఘటన.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తల్లి, ప్రియుడుతో కలిసి తండ్రిని చంపేసింది.. తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్లి..
హైదరాబాద్ కవాడిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తల్లి, ప్రియుడితో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది.

Daughter kills father
Hyderabad: హైదరాబాద్ కవాడిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తల్లి, ప్రియుడితో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది. కల్లులో నిద్ర మాత్రలు కలిపి తాగించాక ముఖంపై దిండుతో అదిమిపెట్టి చంపేందుకు ప్రయత్నించారు. చనిపోకపోవటంతో ఛాతిపై పిడిగుద్దులుగుద్దారు. తాడుతో ఉరి బిగించి హత్య చేశారు. ఆ తరువాత ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో డెడ్ బాడీని క్యాబ్ లో తీసుకెళ్లి చెరువులో పడేశారు.. అయితే, వారు చేసిన చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వడ్లూరి లింగం (45)కు భార్య శారద, ఇద్దరు కుమార్తెలు. హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీలో నివాసం ఉంటున్నాడు. లింగం పాతబస్తీలోని ఓ అపార్టుమెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మనీషాకు వివాహమైంది. మనీషాకు భర్త స్నేహితుడు మహ్మద్ జావీద్ తో వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో మనీషాను భర్త వదిలేశాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి మౌలాలీలో అద్దె ఇంట్లో ఉంటోంది. కూతురు వేరేవాళ్ల ఇంట్లో ఉండటం నచ్చని ఆమె తండ్రి లింగం పలుమార్లు ఘర్షణ పడ్డాడు.
ఇతరులతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తనను తరచూ వేదిస్తున్నాడని తల్లి శారత కుమార్తె మనీషాకు చెప్పింది. అప్పటికే మనీషాకు తన తండ్రికి పలుసార్లు ఘర్షణ కావడంతో.. తండ్రి అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఈ విషయాన్ని తల్లికి చెప్పి ఒప్పించింది. దీంతో లింగంను హత్య చేయాలని నిర్ణయించుకున్న వారు.. మహ్మద్ జావీద్ కు ఈ విషయం చెప్పారు.
ముగ్గురు కలిసి ఈనెల 5వ తేదీన లింగం తాగే కల్లులో నిద్ర మాత్రలు కలిపారు. ఆ కల్లును శారద తీసుకెళ్లి భర్తతో తాగించింది. దీంతో లింగం నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరువాత మనీషా, జావీద్, శారద కలిసి లింగం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా నొక్కి చంపేశారు.
లింగం చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత వాళ్లు సెకండ్ షో సినిమాకు వెళ్లొచ్చారు. అర్ధరాత్రి తరువాత ఇంటికొచ్చి ఓ క్యాబ్ ను మాట్లాడుకున్నారు. మృతదేహాన్ని కారు ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానంతో ప్రశ్నించాడు. కల్లు తాగి మత్తులో ఉన్నాడని క్యాబ్ డ్రైవర్ ను నమ్మించారు. ఎదులాబాద్ వద్ద దిగారు. అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు.
ఈనెల 7వ తేదీన ఓ వ్యక్తి చెరువు వద్ద మృతదేహాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లకు పోలీసులకు తెలపడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికి తీపించారు. ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తరువాత లింగంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కుటుంబ సభ్యుల ప్రవర్తనలో అనుమానం రావడంతో.. చెరువు సమీపంలోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరా ఫుటేజీలను వారికి చూపించగా.. మేమే హత్య చేశామని చెప్పారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.