Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం.. త్వరలో ప్రకటన..?
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

Hyderabad Metro
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం నష్టాలు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్అండ్‌టీ తన మొత్తం నష్టాలను రూ.6,500 కోట్లుగా ప్రకటించింది. ఇందులో మెట్రో భాగం కూడా ఉంది. ఈ భారం నుంచి బయటపడాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని మెట్రో యాజమాన్యం భావిస్తోంది.
నష్టాలు తగ్గించుకోవాలంటే కచ్చితంగా ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గం అని ఎల్అండ్‌టీ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44శాతం పెరగడంతో హైదరాబాద్ మెట్రోసైతం ఛార్జీలు పెంపునకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కనిష్ఠ ఛార్జీ రూ.10, గరిష్ఠంగా ఛార్జీలు రూ.60 ఉన్నాయి. దీనిపై ఎంత పెంచాలి..? ఎప్పుడు పెంచాలి..? మొదట పెంచి ఆ తరువాత తగ్గించాలా..? ఇలా పలు కోణాల్లో సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే రూ.59తో ఉన్న హాలిడే సేవర్ కార్డును రద్దు చేసింది. మెట్రో కార్డుపై రద్దీ వేళల్లో 10శాతం రాయితీని ఎత్తివేసింది.
Also Read: IPL 2025: మేం చేసిన తప్పు అదే.. అందుకే ఓడాం.. ముంబైపై ఓటమి తరువాత పాట్ కమిన్స్ కీలక కామెంట్స్
మెట్రో స్టేషన్లు, మాల్స్ లో రిటైల్ స్పేస్ లీజ్, ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపర్చుకోవడానికి మెట్రో యాజమాన్యం నిరంతరం ప్రయత్నిస్తున్నా నష్టాలు భరించలేని స్థాయికి చేరాయని అధికారులు చెబుతున్నారు. అయితే, గతంలో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం టికెట్ల రేట్ల పెంపుకోసం ప్రయత్నించినా ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ఆ తరువాత క్రమక్రమంగా రాయితీలను తొలగిస్తూ వచ్చింది.
తాజాగా.. మరోసారి మెట్రో రేట్ల పెంపుపై చర్చ నడుస్తోంది. నష్టాల్లో నడుస్తున్న మెట్రోకు ఛార్జీల పెంపుతో ఊరట లభిస్తుందని యాజమాన్యం భావిస్తుంది. ప్రభుత్వం మెట్రో యాజమాన్యం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత భారం కానుంది.