Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం స్కీంకు భారీగా దరఖాస్తులు.. అత్యధికంగా ఆ కేటగిరీకే.. అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే?
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది.

Rajiv Yuva Vikasam
Rajiv Yuva Vikasam: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓబీసీ వర్గాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. మొత్తం ఐదు లక్షల మందిని ఎంపిక చేసి వారికి రాయితీపై యూనిట్లను అందజేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్ లో ఆరువేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
రాజీవ్ యువ వికాసం పథకానికి మొత్తం 16,23,764 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కేటగిరీ-4కు 12.41లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. యూనిట్ విలువ ఆధారంగా ఈ విభజన చేశారు. రూ.50వేలలోపు ఆర్థిక సాయంకోసం దరఖాస్తు చేసుకున్న వారిని కేటగిరీ -1లో చేర్చారు. రూ.50వేల నుంచి రూ.లక్ష మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ-2లో, రూ.లక్ష నుంచి రూ.2లక్షల మధ్య ఉన్న దరఖాస్తులు కేటగిరీ-3లో, రూ.2లక్షల నుంచి రూ. 4లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ-4లో చేర్చారు.
కేటగిరీ-1 కింద వందశాతం రాయితీతో ప్రభుత్వం రూ.50వేల రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ కేటగిరీకి 39,401 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కేటగిరీ-2లో 93,233 దరఖాస్తులు, కేటగిరీ-3లో 2,49,434 దరఖాస్తులు, కేటగిరీ-4లో ఏకంగా 12,41,696 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 75శాతం నాలుగో కేటగిరీ కిందనే దరఖాస్తు చేయడం గమనార్హం. ఎందుకంటే.. రూ.4లక్షల విలువైన యూనిట్ విలువలో 70శాతం రాయితీతో దాదాపు రూ.28లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ మంది కేటగిరీ-4నే ఎంచుకున్నారు.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రాయితీపై ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారికి అవసరమైన నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం కింద అర్హత పొందిన వారికి రెండు దఫాలుగా వారి అకౌంట్లలో నగదు జమకానుంది. తొలుత సగభాగం యూనిట్లు కొనుగోలు చేసే సమయంలో, మిగిలిన సగభాగం యూనిట్లు కొనుగోలు చేసిన తరువాత అందజేయనున్నారు.