తెలంగాణకు మరో మణిహారం : హైదరాబాద్ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు

Regional Outer Ring Road : తెలంగాణకు మరో మణిహారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డుకు జాతీయ హోదాకు తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డుకు అయ్యే ఖర్చు ఎంత?
తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ రహదారి గుర్తింపు కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో కలిసి నితిన్ గడ్కరీని కలిసిన బీజేపీ నేతలు.. ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరం వైపు రోడ్డును జాతీయ రహదారిలో భాగంగా గుర్తించినట్లే.. దక్షిణం వైపు రోడ్డును కూడా గుర్తించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిలో రీజనల్ రింగ్ రోడ్డు కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు ఉందన్న కిషన్‌రెడ్డి.. రీజనల్ రింగ్ రోడ్డుతో వివిధ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో హైదరాబాద్ చేరుకుండానే బెంగళూరు-వారణాసి, విజయవాడ-ముంబై జాతీయ రహదారులను అనుసంధానం చేసే అవకాశం ఉంది. సమయం, ఇంధనం ఆదా అవుతుంది. ప్రతిపాదిత నూతన రీజినల్ రింగ్ రోడ్డుతో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, యాచారం, కడ్తాల్, షాద్‌నగర్, పరిగి, పూడూరు, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల మీదుగా రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు వెళ్లే అవకాశముంది. 338 కిలో మీటర్ల పొడవు నిర్మాణంతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు.
రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మొత్తం 17వేల కోటజ్ల రూపాయలు ఖర్చు కానుంది. ఇందులో 4 వేల కోట్లు భూసేకరణకే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 19 వందల ఐదు కోట్లను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ త్వరగా జరిపితే.. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం వేగంగా చేపడతామంటూ నితిన్ గడ్కరీ బీజేపీ నేతలకు చెప్పారు.