హడలెత్తిస్తున్న హైడ్రా.. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

భారీ బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలను తొలగించారు. మరోవైపు దీనిపై స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు స్పందించారు.

హడలెత్తిస్తున్న హైడ్రా.. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Updated On : September 23, 2024 / 4:40 PM IST

Hydra Demolitions : హైదరాబాద్ లో అకమ్ర నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతోంది. నిన్న మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. ఇవాళ(సోమవారం) మాదాపూర్ లోని అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసింది. కావూరి హిల్స్ పార్క్ స్థానంలో అక్రమ షెడ్లను కూల్చేసింది హైడ్రా. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గతకొంత కాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేస్తోంది. దీంతో సోమవారం అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. అనంతరం అక్కడ కావూరి హిల్స్ మార్గ్ అనే బోర్డును ఏర్పాటు చేశారు.

భారీ బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలను తొలగించారు. మరోవైపు దీనిపై స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు స్పందించారు. కావూరి హిల్స్ అసోసియేషన్ తమకు ఆ ప్లేస్ ని 25ఏళ్లకు లీజుకి ఇచ్చిందన్నారు. ఆ గడువు ముగియకముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు.

ఆదివారం కూడా మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. కూకట్ పల్లిలోని నల్లచెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, కిష్టారెడ్డిపేటలో చెరువులో నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు అధికారులు. నిన్న తెల్లవారుజామునే జేసీబీలతో వెళ్లిన అధికారులు అర్థరాత్రి వరకు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. కూకట్ పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చేసింది.

Also Read : రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..

నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. ఇందులో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో 7 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. బఫర్ జోన్ లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్ మెంట్లను నిర్మించారు. ఎఫ్ టీఎల్ లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 సెంట్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చేసింది. సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించారు.

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. ఆదివారం నల్లచెరువు పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో అక్రమ షెడ్లను తొలగించారు. కంటిన్యూగా రెండోరోజు కూడా కూల్చివేతలు కొనసాగించారు. కావూరి హిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించి ఏర్పాటు చేసిన జిమ్ ను తొలగించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది. పార్కు ప్లేస్ లో ఉన్న జిమ్ షెడ్లను తొలగించారు.

హైడ్రా ఏర్పడ్డ దగ్గరి నుంచి చూసుకుంటే.. ఇప్పటివరకు 23 చోట్ల 262 ఆక్రమణలను తొలగించింది. చెరువులు, నాలాలు, జీహెచ్ఎంసీ పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. హైడ్రా ఏర్పడిన దగ్గరి నుంచి ఇప్పటివరకు కేవలం వీకెండ్స్ లో మాత్రమే అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగించింది. రానున్న రోజుల్లో వారం మొత్తం కూడా ఆక్రమణల తొలగింపు పనులు కొనసాగించేందుకు హైడ్రా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కూల్చివేతలకు అవసరమయ్యే భారీ క్రేన్లను సైతం సమకూర్చుకునే ప్రయత్నం కూడా హైడ్రా చేస్తోంది. దీనికి సంబంధించి టెండర్లు పిలిచే యోచనలో ఉంది.