IAS Smita Sabharwal: ఆ ఒక్క రీపోస్టుతో చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు..

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై పోస్టులు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది.

IAS Smita Sabharwal: ఆ ఒక్క రీపోస్టుతో చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు..

Smita Sabharwal

Updated On : April 16, 2025 / 9:09 PM IST

IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల ఏఐ ఫోటోను పోస్ట్ చేసినందుకు వివరణ కోరుతూ నోటీసులు సర్వ్ చేశారు. కంచ భూముల్లో బుల్డోజర్ల ముందు జింకలు, నెమళ్లు ఉన్నట్లుగా గిబ్లీ ఇమేజ్ ను hi hyderabad ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేయగా, దాన్ని స్మితా సబర్వాల్ మార్చి 31న రీపోస్ట్ చేశారు.

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై పోస్టులు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఇందులో భాగంగానే స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేశారు. ఆమె తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. ఇప్పడామెకు నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

Also Read: గ్రూప్-1 పరీక్షలో అతిపెద్ద కుంభకోణం జరిగింది, రద్దు చేయాలి- పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అటు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా? 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పండి అంటూ జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.

ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ.. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వివరించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు.

జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ”వీడియోలు చూసి ఆందోళనకు గురయ్యాం. పర్యావరణ పరిరక్షణలో రాజీలేదు. అనుమతులు తీసుకున్నారా..? లేదా..? అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకెళ్లాల్సి వస్తుంది. 1996 డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోం” అంటూ జస్టిస్ గవాయ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here