Digital Tree Aadhaar: ‘డిజిటల్ ట్రీ ఆధార్’.. ఈ ఐడియాకు సలాం కొట్టాల్సిందే.. ఫొటోలు చూస్తారా?

నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయో, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటో దీని ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.

Digital Tree Aadhaar: ‘డిజిటల్ ట్రీ ఆధార్’.. ఈ ఐడియాకు సలాం కొట్టాల్సిందే.. ఫొటోలు చూస్తారా?

Updated On : March 2, 2025 / 7:05 PM IST

ఆదిలాబాద్‌లోని ఇచ్చోడ మండలం మోడల్ విలేజ్ ముఖ్రా (కె) మాజీ సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి చెట్లను సంరక్షించడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. గ్రామస్థులు చెట్లు నాటే కార్యక్రమాలు నిర్వహించాక ఆ చెట్లకు జియో-ట్యాగింగ్ చేసి, క్యూఆర్‌ కోడ్‌ను కూడా ఇచ్చారు.

ఈ డిజిటల్‌ ట్రీ ఆధార్‌ కార్యక్రమం గురించి తెలుపుతూ ఇటీవల బీఆర్ఎస్‌ నేత సంతోష్ కుమార్ కూడా పలు ఫొటోలను పోస్ట్ చేశారు. చెట్లకు తగిలిస్తున్న ఈ క్యూఆర్‌ కోడ్ల ద్వారా చెట్టు పెరుగుదల, వయస్సు, ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. తెలంగాణలో చెట్ల డిజిటల్ ట్రాకింగ్‌ను ప్రవేశపెట్టిన మొదటి గ్రామంగా ముఖ్రా (కె) నిలిచింది.

ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి మంచి ఫలితాలను ఇస్తోంది. భారత్‌లో పథకాలను పొందటానికి, ఇతర అంశాలను ఆధార్ కార్డు ఎలా తప్పనిసరి చేస్తే ఎలా ఫలితాలు వస్తున్నాయో, అలాగే, చెట్ల డేటాబేస్‌కు ఈ డిజిటల్‌ ట్రీ ఆధార్‌ ఉపయోగపడుతుందని మాజీ సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి చెప్పారు. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయో, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటో దీని ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.

ఒకవేళ ఏదైనా మొక్క చనిపోతే మళ్లీ అక్కడే మరో మొక్క నాటొచ్చని తెలిపారు. గతంలోనూ ముఖ్రా (కె) గ్రామం మరో ఘనత సాధించింది. గతంలో గ్రామంలోని చెత్త నుంచి గ్రామస్థలు వర్మీకంపోస్టును తయారు చేశారు.

దాన్ని అమ్మగా రూ.5 లక్షలు వచ్చాయి. దాంతో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నారు. దాని ఫలితంగా స్ట్రీట్‌ లైట్లు, సర్కారీ భవనాలకు విద్యుత్‌ ఫ్రీగా అందుతోంది. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టి మంచిపేరు తెచ్చుకున్నారు ఆ గ్రామస్థులు.