Indiramma houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కీలక అప్డేట్.. బిల్లుల చెల్లింపుల్లో మార్పులు చేసిన ప్రభుత్వం.. ఇకనుంచి ఆ డబ్బులు పడవ్..
Indiramma houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5లక్షలను ప్రభుత్వం అందిస్తుంది. ఆ డబ్బులను నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే,
Indiramma houses
Indiramma houses : రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పేదలకు ఇండ్లు నిర్మిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లను కేటాయించి నిర్మాణాలను చేపడుతోంది. ఇండ్ల నిర్మాణాలు చేసుకున్న వారికి విడతల వారీగా నిధులను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటికే పలు ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) లో గృహప్రవేశాలు కూడా పూర్తయ్యాయి.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5లక్షలను ప్రభుత్వం అందిస్తుంది. ఆ డబ్బులను నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే, ప్రస్తుతం పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాలుగు విడతలుగా అందజేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో మార్పులు చేసినట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పనిదినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇందిరమ్మ లబ్ధిదారులకు డబ్బులు చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసింది ప్రభుత్వం.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్మెంట్ వరకూ నిర్మాణం పూర్తయితే రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో రూ.లక్షను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తయిన తరువాత లబ్ధిదారులకు రూ.2లక్షలను చెల్లిస్తున్నారు.
అయితే, ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుంది. దీంతో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొత్తాన్ని ( ప్రస్తుతం రూ.2లక్షలు చెల్లిస్తున్నారు) రూ.1.40లక్షలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇకనుంచి శ్లాబ్ పూర్తయిన వారి ఖాతాల్లో రూ.1.40లక్షలు మాత్రమే జమ అవుతాయి. దీంతో రూ.60వేలను ప్రభుత్వం కోత పెట్టింది. ఇక మిగిలిన రూ.లక్షను ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత విడుదల చేస్తారు.
