చిన్నారి హితీక్ష హత్య కేసును ఛేదించిన పోలీసులు.. రివేంజ్ డ్రామా రేంజ్‌లో మహిళ కన్నింగ్ ప్లాన్ వేసి..
తనను ఏడిపిస్తున్న వారిని జీవితాంతం ఏడిపించాలనే ఉద్దేశంతో పాపను మమత..

జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితీక్ష (5) హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ పాప చిన్నమ్మ (బాబాయ్ భార్య) మమతే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మమతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెట్టింగ్ యాప్‌ల వంటి వాటిల్లో 30 లక్షల రూపాయలకుపైగా పెట్టి మమత సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. దీంతో తోడికోడళ్లు, కుటుంబ సభ్యులు తనను చులకనగా చూడడంతో పగ పెంచుకుంది.
తనను ఏడిపిస్తున్న వారిని జీవితాంతం ఏడిపించాలనే ఉద్దేశంతో పాపను మమత హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు షాపింగ్ కోసం కరీంనగర్ వెళ్లగా ఇదే అదునుగా హితీక్ష హత్యకు ప్లాన్ వేసింది మమత.
స్కూల్ నుంచి హితీక్ష రావడంతో ఆమెను పక్కింట్లోకి తీసుకెళ్లింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాత్రూంలో కత్తితో చిన్నారిని గొంతు కోసి, హత్య చేసింది. అనంతరం ఇంట్లోకి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా హితీక్షను తానే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించి చూశారు.
మమత గంటల వ్యవధిలో దుస్తులు మార్చుకున్నట్లు క్షుణ్ణంగా కనిపించడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. పోలీసుల విచారణలో మమత నిజాలు ఒప్పుకున్నట్లు తెలిసింది. 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.