తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగింపు

తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్ డౌన్ ను హైకోర్టు మరోసారి పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో కోర్టులు, ట్రిబ్యునళ్ల లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగించింది. అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో ఆన్ లైన్ తోపాటు నేరుగా పిటిషన్లు దాఖలుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజు రోజుకూ కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చారు.