Karimnagar Lok Sabha Constituency : కరీంనగర్ పార్లమెంట్‌పై మూడు పార్టీల నజర్… బీఆర్‌ఎస్ ఇలాఖాలో కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ పావులు
ఐతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఆయన సతీమణి జమున బరిలోకి దిగే చాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఈ మధ్యే ఈటల ప్రకటించారు. దీంతో అభ్యర్థి మార్పు ఖాయం అనే చర్చ మొదలైంది.

KARIMNAGAR
Karimnagar Lok Sabha Constituency : కరీంనగర్.. పోరాటం తెలిసిన గడ్డ.. ఉద్యమాలు పురుడు పోసుకున్న గడ్డ. ప్రత్యేక రాష్ట్రం నినాదంతో టీఆర్ఎస్ పుట్టింది ఇక్కడే ! తెలంగాణ బీజేపీకి ఆశలు మొదలైంది ఇక్కడే ! కాంగ్రెస్ కంచుకోట కూడా ఇక్కడే ! అందుకే మూడు పార్టీలకు కరీంనగర్ పార్లమెంట్ ప్రతిష్టాత్మకం. బీఆర్‌ఎస్ ఇలాఖాలో కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ పావులు కదుపుతుంటే.. ఇక్కడి నుంచే బౌన్స్‌బ్యాక్ కావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో కచ్చితంగా గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎలాంటి స్కోప్ ఉంది.. బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం చేసిన స్ట్రాటజీ ఏంటి.. హుజురాబాద్ బరిలో ఈసారి ఈటల ఉండరా…. సిరిసిల్లలో కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి.. అసలు బీఆర్ఎస్ కచ్చితంగా గెలిచే స్థానాలు ఎన్ని.. బీజేపీ ఉన్న బలమైన అభ్యర్థులు ఎందరు.. విజయం కోసం హస్తం పార్టీ వేస్తున్న ప్లాన్లేంటి..? కరీంనగర్ పార్లమెంట్ రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పుడు చూద్దాం..
కరీంనగర్‌లో సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ టికెట్లు ఖాయమా ? విజయం కోసం హస్తం పార్టీ వేస్తున్న ప్లాన్లేంటి?
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డ కరీంనగర్. ఇక్కడ రాజకీయాన్ని కొట్టడం అంటే.. విజయాన్ని పార్టీ ఆఫీసులో కట్టేయడమే ! పార్టీలన్నీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయ్ ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ! రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లాలో రాజకీయం రోజుకోరకంగా మారుతూ ఉంటుంది. విలక్షణ తీర్పుతో రాజకీయ పార్టీల అంచనాలను ఓటర్లు మారుస్తుంటారు. జనాల నాడి అందుకోవడం అంత ఈజీ కాదు ఇక్కడ ! దీంతో పార్టీలన్నీ ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయ్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. మూడు పార్టీలు కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఎంపీగా గెలవడంతో పాటు.. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జెండా పాతేందుకు వ్యూహాలు రచిస్తున్నాయ్. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

KCR, SANJAY, PONNAM, VINOD,MURALIDHAR
గులాబీ బాస్ కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన కరీంనగర్
గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు.. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన నియోజకవర్గం కరీంనగర్. సిద్దిపేట ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం ఉన్న కేసీఆర్… టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత కరీంనగర్ నుంచే తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఎంఎస్‌ఆర్‌లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే.. 2024 బరిలోనూ దిగేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్.. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్.. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్.. మరోసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో… ఈ ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలోనూ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఊహించని సమీకరణాలు, పరిణామాలు చోటుచేసుకుంటే.. వేములవాడ బిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న చలిమెడ లక్ష్మీనరసింహారావును… కరీంనగర్ ఎంపీ బరిలోకి దింపే చాన్స్ కూడా ఉంది. బండి సంజయ్ అసెంబ్లీ స్థానానికే పరిమితం అయితే.. బీజేపీ నుంచి ఎంపీ స్థానానికి మురళీధర్ రావు పోటీ చేసే చాన్స్ ఉంది.
READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం
గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపించగా.. ఈసారి బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపించే అవకాశాలు ఉన్నాయ్. రెండు పార్టీలు కరీంనగర్ మీద ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నాయ్. జనాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ.. వారిని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నాయ్. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. బీఆర్ఎస్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ స్థానంతో పాటు.. హుజురాబాద్ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగురుతుండగా… మిగతా ఆరు నియోజకవర్గాలు బీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నాయ్. బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న కరీంనగర్‌పై ఇప్పుడు కమలం పార్టీ ఫోకస్ పెట్టడంతో.. రాజకీయాలు రసరవత్తరంగా మారాయ్.

GANGULA, ROHITH RAO
కరీంనగర్ లో బీజేపీ నుంచి బండి సంజయ్ ఒక్కరే…కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్‌తో పాటు..
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకం. మంత్రి గంగుల కమలాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మళ్లీ గంగుల పోటీకి దిగడం ఖాయం. ఐతే ఆయనను ఎంపీగా బరిలోకి దింపుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజికవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న గంగులపై.. బీఆర్ఎస్ అధిష్టానం ప్రయోగం చేసి ఎంపీగా బరిలోకి దింపితే.. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. బీజేపీ నుంచి బండి సంజయ్ తప్ప.. మరో బలమైన అభ్యర్థి కనిపించడం లేదు. గతంలో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బండి.. ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్‌తో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు.. మాజీ మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు నరేందర్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తన్నాయ్. తాను ఎంపీ బరిలో నిలిస్తే.. రోహిత్ రావుకు పొన్నం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయ్. ఈ మూడు పార్టీలతో పాటు వైటీపీ, బీఎస్పీ, ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీలు కూడా పోటీకి సిద్ధం అవుతున్నాయ్.

KTR, MAHENDER
సిరిసిల్లలో వార్‌వన్‌సైడ్….బీఆర్ఎస్ నుంచి బరిలో కేటీఆర్
కేటీఆర్ ఇలాఖా అయిన సిరిసిల్లలో వార్ వన్‌సైడ్‌గానే ఉంది. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ బరిలో దిగబోతుండగా.. బీజేపీకి ఇక్కడ సరైన అభ్యర్థి కనిపించడంలేదు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కేటీఆర్‌కు పోటీగా నిలిపేందుకు కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. కేకే మహేందర్ రెడ్డి మాత్రమే కేటీఆర్‌కు ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. మహేందర్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నా.. హస్తానికి అంటీముట్టనట్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగుతారా.. పార్టీ మారుతారా అనే చర్చ నడుస్తోంది. బలమైన అభ్యర్థి అన్వేషణలో ఉన్న బీజేపీ.. మహేందర్ రెడ్డిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. సిరిసిల్లలో కేటీఆర్ వర్సెస్ కేకే మహేందర్ రెడ్డి మధ్యే పోటీ కనిపించడం ఖాయం. బీజేపీ నుంచి మాజి ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, న్యాయవాది రమాకాంత్‌తో పాటు.. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన లగిశెల్లి శ్రీను పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్.

rajender,jamuna, koushik,sathish
హుజురాబాద్ నుండి ఈ సారి బీజేపి అభ్యర్ధినిగా బరిలోకి తిగనున్న ఈటెల సతీమణి జమున…
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మరో కీలక అసెంబ్లీ నియోజకవర్గం హుజురాబాద్. ఉపఎన్నిక పుట్టించిన వేడి అంతా ఇంతా కాదు. ఆ సెగ రాష్ట్రం అంతా తగిలింది. బీఆర్ఎస్‌కు బైబై చెప్పిన ఈటల రాజేందర్.. బీజేపీలో చేరారు. ఉపఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఐతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఆయన సతీమణి జమున బరిలోకి దిగే చాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఈ మధ్యే ఈటల ప్రకటించారు. దీంతో అభ్యర్థి మార్పు ఖాయం అనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ పోటీ భారీగా కనిపిస్తోంది. సీనియర్లు అంతా టికెట్ రేసులో ఉండగా.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, బైపోల్‌లో పోటి చేసి ఓడిన గెల్లు శ్రీనివాస్ మధ్య టికెట్ ఫైట్ కొనసాగుతోంది. గెల్లు, కౌశిక్ రెడ్డి వర్గాల మధ్య విభేధాలు బీఆర్ఎస్‌ను టెన్షన్ పెట్టగా.. ఇప్పుడు అంతా కూల్ అయినట్లు కనిపిస్తోంది. ఐతే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికంగా మారింది. ఐతే వీరిద్దరు కాకుండా.. మరో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉందన్న ప్రచారం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. హుస్నాబాద్ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తే.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్‌ను… హుజురాబాద్ బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయ్. సతీష్ తండ్రి కెప్టెన్ లక్మికాంతారావు గతంలో హుజురాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్ కుటుంబానికి అక్కడ బలమైన అనుచర వర్గం ఉంది. కాంగ్రెస్ నుంచి ఉపఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ మరోసారి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

Ramesh, srinivas
ఉత్కంఠ రేపుతున్న వేములవాడ రాజకీయ పరిణామాలు….బండి సంజయ్ బరిలోకి దిగేనా ?
వేములవాడ అసెంబ్లీ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయ్. పౌరసత్వ వివాదం ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. మూడు దశాబ్దాలుగా వేములవాడలో చెన్నమనేని రాజేశ్వరరావు ఆయన కుమారుడు రమేశ్ బాబు రాజకీయమే కొనసాగింది. ఇప్పుడీ వివాదంతో చలిమెడ లక్ష్మీనరసింహా రావు బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగడం ఖాయమనే టాక్ నడుస్తోంది. రమేష్ బాబు, లక్ష్మీనరసింహా రావు మధ్య టికెట్ దోబూచులాట చివరివరకూ సాగే చాన్స్ ఉంది. బీజేపీ నుంచి తన తనయుడు వికాస్‌ను బరిలో దింపాలని.. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్లాన్ చేస్తున్నారు. మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా కూడా వేములవాడ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వేములవాడ బరిలో దిగేందుకు సిద్ధం అవుతుండగా.. అదే జరిగితే ఆశావహుల ఆశలు గల్లంతు అయినట్లే ! కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

balakrishna, yllanna,sathyanarayana
మానకొండూరులో మరోసారి రసమయి బరిలో రసమయి బాలకిషన్…
మానకొండూరులో రసమయి బాలకిషన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్‌లకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించగా మరోసారి రసమయి బరిలో నిలవడం ఖాయం. ఐతే ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పుడ్ కార్పొరేషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆరెపల్లి మోహన్‌కు చుక్కెదురైతే.. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి గాయకుడు దరువు ఎల్లన్న, బండి సంజయ్ అనుచరుడు సోల్లు అజయ్ వర్మ, గడ్డం నాగరాజు పేర్లు వినిపిస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఈసారి మానకొండూర్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. బీఎస్పీ నుంచి రాష్ట్ర కార్యదర్శి నిసాని రామచంద్రం పోటీ చేయనున్నారు.

ravisankar, sobha, sathyam,praveen
చొప్పదండి లో ఎమ్మెల్యే రవిశంకర్ కు స్థానిక నేతలకు మధ్య దూరం…బీఎస్పీ నుంచి బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
చొప్పదండి బీఆర్ఎస్‌లో టికెట్ రేసు పీక్స్‌కు చేరింది. సుంకే రవిశంకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యేకు స్థానిక నేతలకు మధ్య దూరం పెరిగింది. ఐతే పైకి అంతా ఓకే అన్నట్లు కనిపించినా.. వర్గవిభేదాలు ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య సుంకే రవిశంకర్‌ను మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ రేసులో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ స్నేహితుడు కొండయ్యతో పాటు.. మంత్రి గంగుల అనుచరుడు కంసాల శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయ్. చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్.. చొప్పదండి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో పోటీ చేసిన బొడిగ శోభతో పాటు.. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం.. బీఎస్పీ నుంచి ఆర్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు.

satish kumar, praveen, sriram
హుస్నాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు టికెట్ టెన్షన్….పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించే చాన్స్
హుస్నాబాద్‌లో సతీష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే మునుగోడు పరిణామాలతో ఆయన ఇక్కడ టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే హుజూరాబాద్ నుంచి ఆయన బరిలో దిగనున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్నారు. జెన్నపు సురేందర్ రెడ్డి కూడా అదే ఆశతో ఉన్నారు. బండి సంజయ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో హుస్నాబాద్ కూడా ఒకటి. ఆయన బరిలోకి దిగితే.. ఆ ఇద్దరి నిరాశే ! కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. అభ్యర్థులు ఎవరైనా.. మూడు పార్టీల మధ్య ముక్కోణ యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. అదే సమయంలో టికెట్ కోసం భారీగా పోటీ కూడా కనిపిస్తోంది. హుజురాబాద్, చొప్పదండి అసెంబ్లీతో పాటు.. కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ బలంగా కనిపిస్తోంది. వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఉద్యమాల జిల్లాపై ఏ పార్టీది పైచేయి అవుతుందనే ఆసక్తి కనిపిస్తోంది.