KCR: సార్ మౌనం వీడారు సరే.. శివరాత్రి తర్వాత గులాబీ దళపతి సింహగర్జన పక్కానా?

మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ కంటే ముందే ఓ భారీ బహిరంగ సభ ద్వారా పబ్లిక్‌లోకి వెళ్లాలని భావిస్తున్నారట కేసీఆర్.

KCR: సార్ మౌనం వీడారు సరే.. శివరాత్రి తర్వాత గులాబీ దళపతి సింహగర్జన పక్కానా?

BRS Chief KCR

Updated On : February 18, 2025 / 9:08 PM IST

తెలంగాణలో 14 ఏళ్ల పోరాటం.. పదేళ్లు పాలన… ఆ తర్వాత ఏడాదిగా మౌనం. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రై..పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్‌ గత కొద్దిరోజులుగా మౌన ముద్రలో ఉన్నారు. 2001 నుండి అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా ఆయన చుట్టే తిరుగుతు వచ్చింది తెలంగానా రాజకీయం..ఎవరి నోటైనా సారు ప్రస్తావనే.

రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంలోనూ… ఇప్పుడు తెలంగాణలోనూ ఆయన సెంట్రిక్‌గానే పాలిటిక్స్‌ నడుస్తూ వచ్చాయి. కేసీఆర్‌ పేరు తలవని రోజంటూ లేకుండా రాజకీయాలు నడిచాయి. అయితే ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మౌనంగా ఉండటం కొన్నాళ్లుగా హాట్‌ టాపిక్‌గా మారింది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు..తనను కలిసిన నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడిన మాటలు ట్రెండింగ్‌ అవుతూనే ఉన్నాయి.

అయితే సార్ మౌ నం ఇక వీడినట్లేనన్న టాక్‌ గులాబీదళంలో విన్పిస్తోంది.. పొలిటికల్‌గా ఫుల్ యాక్టీవ్ కాబోతున్నారన్న చర్చ గత కొంతకాలం కొనసాగుతూ ఉంది. సరిగ్గా ఇదే టైమ్‌లో కేసీఆర్ బర్త్‌ డే చాలా గ్రాండ్‌గా నిర్వహించారు గులాబీసైనికులు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ భవన్‌లో సంబరాలు హోరెత్తాయి. ఎర్రవెల్లిలోని గులాబీ బాస్‌ వ్యవసాయ క్షేత్రానికి అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. బర్త్‌ డే తర్వాత సరిగ్గా వన్‌ డే గ్యాప్‌లోనే బీఆర్ఎస్‌ కార్యవర్గ సమావేశానికి ప్లాన్ చేశారు కేసీఆర్.

పార్టీ కార్యవర్గం సమావేశం
ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో నిర్వహించే మీటింగ్‌కు రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జులు హాజరుకానున్నారు. లోక్‌సభ పోల్స్‌లో ఘోర ఓటమి తర్వాత.. గులాబీ బాస్‌ నిర్వహిస్తున్న పార్టీ కార్యవర్గం సమావేశం ఇదే.

ఈ భేటీలో భవిష్యత్‌ కార్యాచరణపై కీలక నిర్ణయాలు వెల్లడిస్తారని టాక్. పార్టీకి జోష్‌నిచ్చేలా కేసీఆర్‌ భారీ ప్రణాళికతో రంగంలోకి దిగబోతున్నారని చర్చించుకుంటున్నారు గులాబీ నేతలు. ఈ నెలాఖరులో సభ పెట్టాలనుకుంటున్నామని ఇప్పటికే జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో చెప్పారు కేసీఆర్. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27తో ముగియన్నాయి.

Also Read: వంశీతోనే అయిపోలేదా? ఇంకా అరెస్టులు ఉంటాయా? జగన్‌ ఆ ఇద్దరి పేర్లను ఎందుకు ప్రస్తావించినట్లు?

దీంతో ఫిబ్రవరి 28న లేకపోతే మార్చి ఫస్ట్‌ వీక్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారట గులాబీ బాస్. అంతే కాదు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంతో పాటు పార్టీ మారిన పది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంచార్జుల నియామకం కూడా చేయనున్నారట. రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా రీషప్లింగ్‌ చేయాలని భావిస్తున్నారట. పొలిట్‌ బ్యూరోలో కొత్తవారికి అవకాశం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నారట. యంగ్‌ లీడర్లకు పార్టీ పదవులు ఇస్తే రాబోయే నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడుతారని ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్.

మార్చి ఫస్ట్ వీక్‌లో నిర్వహించే సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్. జనగామ, గజ్వేల్‌, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడో ఓ చోట సభ పెట్టాలని అనుకుంటున్నారట. కామారెడ్డిలో బీసీ సింహగర్జన పెట్టాలనుకున్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ రీసర్వే అంటూ స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో బీఆర్ఎస్ కాస్త ఆలోచనలో పడ్డట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎక్స్‌పోజ్‌ చేయాలని..
అయితే రైతుల సమస్యలపై ప్రత్యేకంగా ఓ సభ నిర్వహించి రేవంత్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్స్‌పోజ్‌ చేయాలని డిసైడ్ అయ్యారట. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి వచ్చే ఏప్రిల్ 27కు 25ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో క్యాడర్‌లో ఫుల్‌ జోష్‌ నింపి..ఇకపై జిల్లాల పర్యటనలు, సమస్యలపై ఎప్పటికప్పుడూ స్పందిస్తూ జనంలోనే ఉండాలని భావిస్తున్నారట గులాబీ బాస్.

అయితే అధికారం కోల్పోయిన జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై ఆసక్తి కొనసాగుతోంది. కేసీఆర్‌ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్‌ కానున్నారని..కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ను సిద్ధం చేస్తారని అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందినా క్షేత్రస్థాయిలో బలంగా ఉండటం.. స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో పార్టీని బలోపేతం చేసే యోచనలో గులాబీ అధినేత ఉన్నారట. కార్యవర్గ భేటీ తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి కేసీఆర్‌ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు.

మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ కంటే ముందే ఓ భారీ బహిరంగ సభ ద్వారా పబ్లిక్‌లోకి వెళ్లాలని భావిస్తున్నారట కేసీఆర్. ఇక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు శాసనసభకు వెళ్లి ఆ తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉండాలని..ముఖ్యంగా రైతుల సమస్యల మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు..ఇప్పుడున్న పరిస్థితులను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. గులాబీ దళపతి వ్యూహమేంటి..భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది చూడాలి మరి.