KCR : ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరవ్వాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు.

KCR : ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరు కావాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. అరగంట ముందుగా 9.30 కే అసెంబ్లీకి రావాలని చెప్పారు. ఎల్పీలో సమావేశం పెట్టుకుని హౌస్ లోకి వెళ్ళండని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చెప్పారు. సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని కేసీఆర్ సూచించారు.
హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సుదీర్ఘంగా వివరించారు కేసీఆర్. పదేళ్లలో బీఆర్ఎస్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే.. కాంగ్రెస్ 14 నెలల్లోనే లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయడం లేదని గుర్తు చేశారు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్ వాపోయారు.
Also Read : గ్రూప్ 2 ఫలితాలు విడుదల.. ర్యాంకులు ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది. బుధవారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆయా అంశాలను లేవనెత్తి రేవంత్ సర్కార్ ను కార్నర్ చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది.
Also Read : తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడుస్తోంది. కానీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా అభివృద్ధి, సంక్షేమం విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలి అన్నదానిపై పార్టీ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఏయే అంశాలపై మాట్లాడాలి, ఎటువంటి విషయాలను ప్రస్తావించాలి అనేదానిపై కీలక సూచనలు చేశారు కేసీఆర్.