గల్లంతవుతోన్న లక్ష్మణ్ ఆశలు.. ఈ సారి కూడా సందేహమే

గల్లంతవుతోన్న లక్ష్మణ్ ఆశలు.. ఈ సారి కూడా సందేహమే

Updated On : July 17, 2020 / 7:19 PM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజకీయ భవిష్యత్‌పై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తెలంగాణ మొదటి శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పని చేశారు. ఆ తర్వాత పరిణామాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చక్రం తిప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు నాయకత్వం వ్యహించారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆయనతో పాటు పార్టీ సైతం ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆయన భవిష్యత్‌పై చర్చ మొదలైంది.

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించడంతో మళ్లీ ఆయనలో ఆశలు చిగురించి.. మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగుతానని ఆశించారు. కానీ, కొత్త అధ్యక్షుడి నియామకంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం తనకు కలసి వస్తుందని అనుకున్నారు లక్ష్మణ్‌. అంతే కాకుండా ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు సన్నిహితుడు కావడంతో తనకు అన్నీ అనుకూలంగా ఉంటాయని సన్నిహితులతో చెప్పుకున్నారట.

మరోసారి అధ్యక్ష పదవి రెన్యూవల్‌ కావడం, ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లడానికి ఉపయోగపడతాయని ప్రచారం కూడా చేసుకున్నారట. తీరా ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోందని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవి చేజారింది. రాజ్యసభ పదవీ వచ్చే అవకాశం కూడా లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆలోచనలో పడ్డారట. ఎందుకిలా జరుగుతోందని సన్నిహితుల దగ్గర బాగా ఫీలవుతున్నారట.

రాజకీయాల్లో మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలబ్బా అనుకుంటూ తెగ ఆలోచిస్తున్నారట లక్ష్మణ్‌. సన్నిహితుల సూచనలతో ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ అడుగుతున్నారనే టాక్‌ నడుస్తోంది. ఆ పదవి ఇస్తే మరోసారి ఇటు రాష్ట్రంలో, అటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పవచ్చని లెక్కలేసుకుంటున్నారని చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. మరి ఈ లక్ష్మణుడికి జాతీయ పెద్దలు సంజీవని ఇచ్చి అందలం ఎక్కిస్తుందో? లేదో వేచి చూడాల్సిందే.