Koppula Eshwar : ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలో చేరారు-కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar: నువ్వు చేసే ప్రతి పని, నడిపే పరిశ్రమలు అన్నీ మీ నాన్న దయ.. అంటే.. కాంగ్రెస్ దయ. నువ్వు బీజేపీలో ఎలా చేరతావు? సమాధానం చెప్పాలి.

Koppula Eshwar : బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు దళిత వ్యతిరేక పార్టీ అని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దేశంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. పదవిలో ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా ఒకేలా ఉండే వ్యక్తిని నేను అని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నేను నాయకుడి కంటే సేవకుడిని, నిజాయితీగా పని చేసే వ్యక్తిని అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. లక్ష్మణ్ కుమార్ పై ఆయన ఫైర్ అయ్యారు. లక్ష్మణ్ కుమార్.. దేనిలోనూ తనతో సరిపోరని అన్నారు. నీకు నీతి నిజాయితీ లేదు, నువ్వు గతంలో మార్కెట్ చైర్మన్ పదవులు డబ్బులకు అమ్ముకున్నావ్ అని లక్ష్మణ్ కుమార్ పై ఆరోపణలు గుప్పించారు.(Koppula Eshwar)
బీజేపీ నేత వివేక్ పైనా మంత్రి కొప్పుల ఫైర్ అయ్యారు. వివేక్ తండ్రి వెంకటస్వామి దేశ స్థాయిలో గొప్ప నాయకుడు అని కితాబిచ్చారు. వెంకటస్వామి దళిత వర్గాల్లో ఒక ఆశాజ్యోతి అని, అనేక పనులు చేశారని గుర్తు చేశారు. వివేక్ మాత్రం అలా కాదన్నారు. కేవలం అధికారం కోసం ఎన్ని పార్టీలు మారుతావు అని వివేక్ ను ప్రశ్నించారు మంత్రి కొప్పుల.
నువ్వు చేసే ప్రతి పని, నడిపే పరిశ్రమలు అన్నీ మీ నాన్న దయ.. అంటే.. కాంగ్రెస్ దయ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. నువ్వు బీజేపీలో ఎలా చేరతావు? దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని వివేక్ ను డిమాండ్ చేశారు. ఆస్తుల రక్షణ, అధికారం కోసమే వివేక్ బీజేపీలో చేరారని మంత్రి కొప్పుల ఆరోపించారు. అయినా, బలమైన బీఆర్ఎస్ పార్టీ ముందు ఎవరు వస్తే మనకేంది? మన గెలుపు ఎవరూ ఆపలేరు అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.