నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు చిక్కిన చిరుత

నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు చిరుత పులి చిక్కింది. రెండు గంటలపాటు కష్టపడి ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకున్నారు. మర్రిగూడెం మండలం రాజంపేట తండాలో చిరుత ప్రత్యక్షమైంది. రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. చిరుతను బంధించేందుకు వచ్చిన అధికారులపై చిరుత దాడి చేసింది. చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా తప్పించుకుని వారిపై దాడి చేసింది. చిరుత దాడిలో ఇద్దరు ఫారెస్టు అధికారులు గాయాలు అయ్యాయి. తర్వాత రెండు గంటలపాటు కష్టపడి ఫారెస్టు అధికారులు బంధించారు.
గతంలో నల్గొండ జిల్లాలోని అజలాపురంలో ఇలాగే ఓ చిరుత వలలో చిక్కుకుంది. అప్పట్లో వలపెట్టిన రైతు ధర్మానయక్ పైనే పోలీసులు కేసు నమోదు చేశారు. చిరుతలు తిరుగుతున్నాయని తమను కాపాడాలంటూ రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో మరోసారి రాజంపేట తండాలో చిరుత అదే తరహా కంచెలో చిక్కుకుంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత సంచరించింది.
మర్రిగూడెం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయని చాలా కాలంగా చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. నాలుగు నెలల క్రితం మర్రిగూడెం మండలం అజలాపురంలో ఓ సారి చిరుత చిక్కుకుంది. ఆ సందర్భంలో కూడా మరికొన్ని చిరుతల కదలికలు తమకు ఉన్నాయని రైతులు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.