Lock down Fear : లాక్‌డౌన్ భయంతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

Lock Down News Hyderabad Becoming Vacant
Lock down news Hyderabad becoming vacant : హైదబాద్ గా పిలుచుకునే మన భాగ్యనగరం లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధుల్ని కల్పించింది. వలసజీవిని అక్కున చేర్చుకున్న భాగ్యనగరం నేడు మరోసారి ఖాళీ అవుతోంది. పొట్ట చేత పట్టుకుని కుటుంబంతో సహా తరలి వచ్చిన వలస జీవిమరోసారి బెంబేలెత్తిపోతున్నాడు. కరోనా పుణ్యమాని వచ్చిన గత లాక్ డౌన్ తో నవనాడులు కృంగిపోయి చేతిలో చిల్లిగవ్వ లేక సొంత ఊళ్లకు కాలి నడకన వెళ్లిన వలస జీవులకు మరోసారి లాక్ డౌన్ భయం వెన్నాడుతోంది. దీంతో మరోసారి భయంతో సొంత ఊళ్లకు పయనమవుతున్నారు వలసజీవులు. కరోనా సెకండ్ వేవ్ తో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ నైట్ కర్ఫ్యూ విధించింది. కానీ కర్ఫ్యూ పూర్తి అయ్యాక పరిస్థితులు ఇలాగే ఉన్నా..కేసులు ఇంకా పెరిగినా లాక్ డౌన్ విధిస్తారనే భయంతో పలువురు ఇళ్లు ఖాళీ చేసి సొంత ఊళ్లకు పయమనవుతున్నారు.
దీంతో రైళ్లలో రోజుకు సగటు 2.60 లక్షల మంది ప్రయాణమై సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. మరోపక్క బస్సులు కూడా కిటకిటలాడుతున్నాయి. దీంతో తెల్లారిలేస్తే క్యారియర్ చేత్తో పట్టుకుని రోడ్లపై అడ్డాలకు వచ్చి పనికోసం ఎదురు చూసే రోజు కూలీల నుంచి చిన్నా మధ్యతరగతి కుటుంబాల వారు కూడా సొంత ఊళ్లకు వెళ్లిపోతుండటంతో హైదరాబాద్ లో రోడ్డు బోసిపోతున్నాయి.
బస్సులు, రైళ్లతో పాటు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని సొంతూళ్ల బాటపడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే తరలిపోతుండడంతో రాజధానిలోని శివారు ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస కార్మికులు దాదాపు 18 లక్షల మంది వరకు ఉండగా, వీరిలో దాదాపు 60 శాతం మంది వారం క్రితమే నగరాన్ని విడిచిపెట్టారు. మిగిలిన వారు కూడా వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు.
పెద్ద ఎత్తున తరలిపోతున్న వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి బయలుదేరే రైళ్లు నిండిపోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన, విశాఖపట్టణం వెళ్లే గోదావరి, కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు గత వారం రోజులుగా ప్రయాణికులతో కిక్కిరిసి వెళుతున్నాయి. ఇక ఆయా రైళ్లలో రిజర్వేషన్ నాలుగైదు రోజుల ముందే పూర్తయిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజుకు సగటున 2.60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, స్వగ్రామాలకు జనం తరలుతుండడంతో నగరంలోని రోడ్లు చాలా వరకు బోసిపోయి కనిపిస్తున్నాయి.