లోక్‌స‌భ‌ ఎన్నికలు.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం

తెలంగాణలో లోక్‌స‌భ‌ ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చర్చలు సఫలం అయినట్టు కనబడుతోంది.

లోక్‌స‌భ‌ ఎన్నికలు.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం

CM Revanth Reddy meet CPM Leaders : లోక్‌స‌భ‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో లోక్‌స‌భ‌ ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సీపీఎం సూచనప్రాయంగా అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తన నివాసంలో సీపీఎం నాయకులతో భేటీ అయ్యారు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులను సీఎం రేవంత్ కోరారు. ఇప్పటికే భువనగిరిలో నామినేషన్ వేసిన సీపీఎం అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని రిక్వెస్ట్ చేశారు.

తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌తో సీపీఎం నాయకులు చెప్పారు. సాయంత్రం తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సీఎం రేవంత్‌ విన్నపానికి సీపీఎం సానుకూలంగా స్పందించారని, 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపు కోసం కృషి చేసేందుకు సీపీఎం నేతలు సిద్ధంగా ఉన్నారని సమాచారం. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తామని సీపీఎం నేతలు చెప్పినట్టు తెలిసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీనియర్ నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య ఉన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే రెండు సార్లు సీపీఎం నాయకులను కాంగ్రెస్ నేతలు కలిశారు. తాజాగా సీఎం రేవంత్.. సీపీఎం నేతలను తన నివాసానికి ఆహ్వానించి చర్చలు జరిపారు. ఎన్నికలు ముగిసిన వెంటనే సీపీఎంకు రెండు కార్పొరేషన్ పదవులు, ఒక ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

Also Read: పాపం.. మంద జగన్నాథం.. పార్టీ మారినా, లాభం లేకపాయె!

సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరాం: సీఎం రేవంత్ రెడ్డి
లోక్‌స‌భ‌ ఎన్నికల గురించి సీపీఎం నాయకులతో చర్చించామని, భువనగిరి పార్లమెంట్ తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చర్చలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”మరి కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టాం. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారు. దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారు. ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్నా.. అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తాం. సీపీఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకెళతాం. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నాన”ని చెప్పారు.

Also Read: అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తున్నది బోగస్ ఓట్లతోనే- మాధవీలత సంచలన ఆరోపణలు