కరీంనగర్‌ ఎంపీ స్థానంలో ట్రయాంగిల్‌ ఫైట్.. కాంగ్రెస్‌‌కు అదే పెద్ద మైనస్

గత 35 ఏళ్లలో హస్తం పార్టీకి కరీంనగర్ జిల్లాలో ఈ రేంజ్‌లో సీట్లు ఎప్పుడూ రాలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోవాలని ప్లాన్‌ సిద్ధం చేస్తోంది.

కరీంనగర్‌ ఎంపీ స్థానంలో ట్రయాంగిల్‌ ఫైట్.. కాంగ్రెస్‌‌కు అదే పెద్ద మైనస్

Karimnagar Lok Sabha Constituency Political Scenario

Karimnagar Lok Sabha Constituency : రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం. ఈ సీటును దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. రెండోసారి ఈ సీటును దక్కించుకునేందుకు సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్లాన్‌ చేస్తుంటే.. ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ చూస్తోంది. ఇక జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌.. బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టింది.

గెలుపు అంత ఈజీ కాదు..
కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం మూడు ప్రధాన పార్టీల నేతలకు పెద్ద టాస్క్‌లా మారింది. ఇక్కడ విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇక సిట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని కమలనాథులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇక్కడ విజయం సాధించడం ఏ పార్టీకీ అంత ఈజీ కాదన్న చర్చ కొనసాగుతోంది.

ఫుల్ జోష్ లో కాంగ్రెస్..
కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లకు గాను నాలుగింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గత 35 ఏళ్లలో హస్తం పార్టీకి కరీంనగర్ జిల్లాలో ఈ రేంజ్‌లో సీట్లు ఎప్పుడూ రాలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోవాలని ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ లోక్‌సభ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ స్థానం నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ప్రభాకర్‌కు ఇది ఛాలెంజింగ్‌గా మారిందంటున్నాయి రాజకీయ వర్గాలు.

కాంగ్రెస్ కు పెద్ద మైనస్..
పేరుకు అధికార పార్టీయే అయినా.. ఈ పార్లమెంట్‌ స్థానంలో బలమైన అభ్యర్థి లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు దాదాపు ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇది కాస్త ఇబ్బందిగానే మారింది. జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరోవైపు NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, హుస్నాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రోహిత్‌రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబు పేరు కూడా ఇటీవల ప్రచారంలోకి వచ్చింది. ఇక మహిళా కోటాలో నేరెళ్ల శారద పేరు ప్రస్తావనకు వచ్చినా.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఉన్న గ్యాప్‌ కారణంగా ఆమె అభ్యర్థిత్వంపై కాస్త డౌట్‌ ఏర్పడింది. వీరిలో అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇస్తుందనే దానిపై క్లారిటీ మాత్రం లేదు.

విజయంపై బీఆర్ఎస్ ఆశలు..
ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ని మరోసారి బరిలోకి దింపడం ఖాయమైంది. గత ఎంపీ ఎన్నికల్లో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఓటమి పాలయ్యారు వినోద్. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే వినోద్‌కుమార్‌ నియెజకవర్గాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా.. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో 5 లక్షల 15వేలకు పైగా ఓట్లు సాధించడంతో విజయంపై ఆశలు పెట్టుకున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ ఓడిపోయిన చోట్ల కూడా సెకండ్ ప్లేస్‌లో ఉండటం తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉందన్న చర్చ కూడా సాగుతోంది.

ఆశలన్నీ మోదీ చరిష్మాపైనే..
సిట్టింగ్‌ స్థానంలో మరోసారి కాషాయ జెండా ఎగురవేయాలన్న కృత నిశ్చయంతో ముందుకెళ్తోంది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో కాషాయం పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోయినా.. పార్టీ అభ్యర్థులు మెరుగైన ఓట్లు సాధించారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్లో కదలిక తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్లే విధంగా పర్యటనలకు ప్లాన్‌ చేసుకున్నారాయన. వచ్చే ఎన్నికల్లో మోదీ చరిష్మా కలిసి వస్తుందని అంచనా వేస్తున్న బండి సంజయ్‌.. పోటీ మాత్రం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీగానే ఉంటుందంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కరీంనగర్‌లో ఢీకొట్టే సత్తా బండి సంజయ్‌కి మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ బరిలో బండి సంజయ్‌, వినోద్‌కుమార్‌ ప్రత్యర్థులని తేలిపోయినా.. కాంగ్రెస్‌ ఎవరిని బరిలో దింపుతుందన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా కరీంనగర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌పై ఏ పార్టీ జెండా ఎగురుతుందన్నది ఆసక్తిగా మారింది.