Bhatti Vikramarka: గత బీఆర్ఎస్ సర్కారు వీరిని పట్టించుకోలేదు: భట్టి విక్రమార్క
నూతనంగా పెంచిన డైట్ చార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత భారం పడుతుందని తెలిపారు.

బీఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. “10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుంది. భూమి లేని నిరుపేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, దానికి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు.
డిసెంబర్ 28వ తేదీన మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తుంది. రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ప్రతి పక్ష పార్టీ వాస్తవాలను అవాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది” అని భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నడిపిస్తున్న అన్ని స్కూళ్లలో డైట్, కాస్మొటిక్ చార్జెస్ పెంచామని భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను, మంత్రులు, రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరం కలిసి అన్ని పాఠశాలలో కూర్చుని భోజనం చేశామని అన్నారు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందించామని చెప్పారు.
నూతనంగా పెంచిన డైట్ చార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత భారం పడుతుందని తెలిపారు. సంవత్సరానికి 541 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వం పై పడుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 2014 నాటికి 72450 కోట్ల రూపాయలని చెప్పారు. ప్రభుత్వంతో పాటు కొన్ని కార్పొరేట్ బ్యాంక్ ల ద్వారా అప్పులు చేసిందని తెలిపారు. 5893 కోట్లు రాష్ట్ర విభజన జరిగే నాటికి అప్పు ఉంటే అవి 95 వేల కోట్లకు పెరిగిందన్నారు.
“10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 23 వేల కోట్లు చేసింది, అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మేము కూడ అప్పులు చేశామని అంటున్నారు, మీరు చేసింది తినేందుకు, మేము చేసేది అప్పు కట్టేందుకు మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50 వేల కోట్లు, మేము అప్పు వడ్డీ కలిపి 66 వేల 722 కోట్లు చెల్లించాం. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు 6 వేల 400 కోట్లు ఉండేది. ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి, తగుదునమ్మా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద అరుస్తా ఉన్నారు. 10 ఏళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి అన్నంలో పురుగులు వంటివి వచ్చాయి.
మళ్లీ తిరిగి రెసిడెన్షియల్ స్కూల్లో టాయిలెట్స్ సరిగా లేవని మాట్లాడుతున్నారు, 10 ఏళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా? రాష్ట్ర వ్యాప్తంగా అందిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటోంది, కొద్ది రోజుల్లో డబ్బు ఇచ్చేస్తుంది. సన్నాలకు 500 వెంటనే వేస్తాం అన్నాం వేశాం, 500 లెక్క ఒక్కో రైతుకి 10 వేలు అలా తీసుకుంటున్నారు. మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 66 వేల కోట్ల రూపాయలు అప్పు కడుతూ రైతుల అప్పు కడుతున్నాం. భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు రైతుల అప్పు కట్టలేదు. రైతు భరోసా 7 వేల 625 కోట్లు కల్పించాం, రైతు భీమా కట్టాం 1500 రూపాయలు రైతు భీమా ప్రభుత్వం కట్టింది” అని భట్టి విక్రమార్క అన్నారు.