ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు.. ఎంపీ టికెట్ రేసులో పలువురు
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ ఇప్పటినుంచే మెుదలైందని చెప్పాలి. నేతల అనుచరులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ తరఫు నాయకులకు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.

Khammam Congress MP ticket race
Khammam Congress MP ticket race: రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా.. ఒక ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులు దక్కాయి. మంత్రి పదవులు దక్కించుకున్న వారంత కీలక నేతలే. డిప్యూటి సీఏం పదవి భట్టి విక్కమార్కకు రాగా.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుకు మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీగా సీట్లు రావడం వెనుక ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారు. ఇపుడిదే ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ టికెట్‌కు తీవ్ర పోటీ నెలకొంది. సీన్ కట్ చేస్తే.. ఈ ముగ్గురు మంత్రుల సంబంధికులు టికెట్ రేసులో ఉండటం మరింత ఆసక్తి రేపుతోంది.
ఎంపీ టికెట్ ఆశిస్తున్న భట్టి విక్రమార్క సతీమణి నందిని
డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల వివిధ సభల్లో మాట్లాడిన ఆమె.. అధిష్టానం ఆదేశిస్తే పోటి చేయడానికి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో భట్టికి ఉన్న అనుచరగణం.. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మధిర నుంచి ఆయన విజయం సాధించడం లాంటి అంశాలు నందినికి కలిసొస్తాయని అనుచర వర్గం చెబుతోంది. భట్టి పోటీ చేసిన ప్రతీసారి ఆమె నియోజకవర్గమంతా ప్రచారం చేస్తోంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిచయాలు, భట్టి నాయకత్వం కలిసొస్తాయనే భావనతో ఆమె పోటీకి సై అంటున్నారు.
టికెట్ రేసులో పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి
ఖమ్మం జిల్లాకు చెందిన మరో కీలక నేత.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన సోదరుడు.. పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస రెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి వైఎస్సార్‌సీపీ, బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్‌రెడ్డి తెర వెనుక నుంచి అన్నీ తానై చూసుకుంటున్నారు. పార్టీ నేతలకు.. క్యాడర్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ శ్రీనివాస రెడ్డి 2014లో ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. సోదరుడి అండతో.. ప్రసాద్ రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటికి ఉన్న చరిష్మా తోడైతే ప్రసాద్ రెడ్డి విజయం నల్లేరు మీద నడకేనన్న చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పరిధిలోని నేతలతో ఉన్న పరిచయాలు ఆయనకు కలిసొచ్చే అంశంగా కార్యకర్తలు భావిస్తున్నారు.
పొలిటికల్ ఎంట్రీకి తుమ్మల తనయుడు యుగంధర్ రెడీ
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో తుమ్మల పోటీ చేసిన ప్రతిసారీ యుగంధర్ పార్టీ నేతలను.. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు, క్యాడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ ఆయనే దగ్గరుండి చూశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మలకు భారీ మెజార్టీ రావడంలో యుగంధర్ కీలకంగా వ్యవహరించారు. దీంతో యుగంధర్ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
Also Read: తన కారుకి స్వయంగా పోస్టర్ అతికించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏంటా పోస్టర్?
మరో ఇద్దరు నేతలు సైతం..
ఈ ముగ్గురు మంత్రుల సంబంధికులే కాకుండా.. మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి లోకసభకు పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఇప్పటికే కోరారు. అయితే సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటి చేస్తారన్న విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సోనియా పోటీ చేస్తే.. పార్టీ కాస్త వీక్ ఉన్న ప్రాంతం నుంచి బరిలోకి దించాలని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. పట్టున్న ఖమ్మం నుంచి బరిలోకి దించినా పార్టీకి పెద్దగా లాభం ఉండబోదన్న చర్చ నడుస్తోంది.
Also Read: పార్లమెంట్ ఎన్నికల ముందు గ్రేటర్‌లో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన కీలక నేత
మొత్తానికి ఈసారి ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ ఇప్పటినుంచే మెుదలైందని చెప్పాలి. నేతల అనుచరులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ తరఫు నాయకులకు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి టికెట్ దక్కుతుందో వేచి చూడాల్సిందే.