By Polls: తెలంగాణలో ఆ పది సీట్లకు బైపోల్ రాబోతుందా?
పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ నుంచి కారు పార్టీ అధిష్టానంపై ప్రెజర్ ఉందంట.

ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ క్లైమాక్స్‌కు చేరుతోంది. సుప్రీం ఆర్డర్స్..జంపింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు..అంతా చకచకా జరిగిపోతోంది. సిచ్యువేషన్‌ను గమిస్తున్న..గులాబీ పార్టీ..కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది బీఆర్ఎస్ శాసనసభ్యులపై వేటు పడటం ఖాయమన్న నమ్మకంతో ఉంది.
అంతేకాదు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుప్రీంలో విచారణ..తెల్లారే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు..ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే.. ఉపఎన్నికలు అనివార్యమన్న టాక్ వినిపిస్తోంది. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఈ నెల 10న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో మరింత క్లారిటీ రానుంది.
బీఆర్‌ఎస్‌కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వచ్చాయి. అందులో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన పది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. మొదట దానం నాగేందర్ ఆ తర్వాత..వరుస పెట్టి మరో 9 మంది కూడా కండువా మార్చేశారు. దానం నాగేందర్ అయితే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు.
బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేటు కోసం న్యాయపోరాటం చేస్తూ వస్తున్న గులాబీ పార్టీ..చివరకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నెల పదో తేదీ వరకు సమాధానం చెప్పాలని స్పీకర్‌ను కోరింది.
ఎమ్మెల్యేలకు నోటీసులు
తెల్లారే అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. వాళ్లు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు కేరళ హైకోర్టు కూడా ఎమ్మెల్యే ఫిరాయింపులపై స్పందించింది. పార్టీ మారాలనుకునేవారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఈ మధ్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కొడితే గట్టిగానే కొడతా అనడం వెనుక..ఉప ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతం ఉందా అన్నది హాట్ టాపిక్ అవుతోంది.
గులాబీ నేతలు అయితే పది స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బైపోల్స్‌కు సిద్ధం కావాలని క్యాడర్, లీడర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్ కూడా ఉపఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారట. అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నట్లు టాక్. ఈ నెలాఖరులోగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇదే విషయాన్ని జహీరాబాద్ కార్యకర్తల భేటీలో చెప్పారు గులాబీ బాస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఫలితాలు తమకే అనుకూలమని అంచనా వేస్తున్న గులాబీ నేతలు..బైపోల్స్‌కు సై అంటున్నారు. గతంలో ఉప ఎన్నికల వచ్చినప్పుడు తాము గెలిచిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు.
ఇక ప్రస్తుత పరిస్థితులు, నాలుగు స్కీమ్‌లపై ఉన్న గందరగోళ వాతావరణం పరిశీలిస్తే..కాంగ్రెస్ సర్కార్‌కు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే 420 హామీలు, ఆరు గ్యారంటీలు నెరవేర్చాలని గులాబీ నేతలు నిలదీస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎక్స్‌లో నిర్వహించిన పోల్‌లో కూడా ఫాంహౌస్ పాలన కావాలని 70 శాతం మంది ఓటేశారు. అందుకే ఈ సమయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త కష్టమేనంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
ఇవన్నీ వరుస ఎపిసోడ్స్‌గా..
అయితే ఉపఎన్నికలు వస్తాయా రావా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాల్సి ఉంది. వాళ్ల వివరణ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యేల వివరణ, స్పీకర్ నిర్ణయం..ఆ తర్వాత సుప్రీం తీర్పు ఇవన్నీ వరుస ఎపిసోడ్స్‌గా మారాయి. క్లైమాక్స్‌లో ఈ నెల 10న ఏదో ఒకటి క్లారిటీ వస్తుందన్న భావనలో బీఆర్ఎస్ ఉంది.
ఇక వేటు తప్పదు..బైపోల్స్ వస్తాయన్న ప్రచారం నెలకొన్న వేళ..జంపింగ్ ఎమ్మెల్యేల దారెటు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హస్తం గూటికి చేరిన 10మందిలో ఎక్కువ మంది సంతృప్తిగా లేరన్న టాక్ ఉంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే ఓపెన్‌గానే తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు తన ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది..ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానంటూ తేల్చి చెప్పారు.
అయితే ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనాతోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్‌పై అభిమానం ఉందని చెప్పుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే జంపింగ్ ఎమ్మెల్యే తిరిగి తెలంగాణ భవన్‌వైపు చూస్తే బీఆర్ఎస్ చేర్చుకుంటుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది.
అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ నుంచి కారు పార్టీ అధిష్టానంపై ప్రెజర్ ఉందంట. ఉప ఎన్నికలు వస్తే గెలిస్తే గెలుస్తామ్.. ఓడితే ఓడుతాం..కానీ నమ్మక ద్రోహం చేసినవాళ్లను తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ పట్టుబడుతుందట. దీంతో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా తయారైందట. బైపోల్స్ వస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్లకు టికెట్ దక్కేలా లేదన్న చర్చ జరుగుతోంది. ఫిరాయింపులపై సుప్రీం తీర్పు తర్వాత తెలంగాణ రాజకీయం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.