Medchal Assembly Constituency : మేడ్చల్‌లో పొలిటికల్ పిక్చర్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ మళ్లీ గెలిచే చాన్స్ ఉందా.. మిగతా పార్టీల లెక్కలు ఏంటి?

తీన్మార్ మల్లన్న కూడా మేడ్చల్ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. ఇలా.. అంతా మేడ్చల్ మీదే ఫోకస్ చేయడంతో.. ఇక్కడి పోరు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Medchal Assembly Constituency : మేడ్చల్‌లో పొలిటికల్ పిక్చర్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ మళ్లీ గెలిచే చాన్స్ ఉందా.. మిగతా పార్టీల లెక్కలు ఏంటి?

Updated On : May 3, 2023 / 3:14 PM IST

Medchal Assembly Constituency: గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో హీటు రేపుతున్న సీటు ఏదైనా ఉందీ అంటే.. అదీ మేడ్చల్ మాత్రమే. ప్రతి సెగ్మెంట్‌లో ఏదో ఒక పార్టీలో టికెట్ పోరు ఉండటం కామన్. కానీ.. ఇక్కడ అలా కాదు. 3 ప్రధాన పార్టీల్లోనూ.. ఇద్దరేసి నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మేడ్చల్ టికెట్ కోసం ఇంత పోటీ ఉండటానికి.. ఈ సెగ్మెంట్ హైదరాబాద్ సిటీకి ఆనుకొని ఉండటమే కారణమా? ప్రస్తుతం.. మేడ్చల్‌లో పొలిటికల్ పిక్చర్ ఎలా ఉంది? అధికార బీఆర్ఎస్.. మళ్లీ గెలిచే చాన్స్ ఉందా? కాంగ్రెస్‌లో నెలకొన్న సమీకరణాలు, బీజేపీ పెట్టుకున్న ఆశలు.. మిగతా పార్టీల లెక్కలు.. ఎలా ఉన్నాయ్? ఓవరాల్‌గా.. మేడ్చల్ అసెంబ్లీ సీటులో.. ఈసారి ఎలాంటి సీన్ కనిపించబోతోంది?

హైద‌రాబాద్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ మేడ్చల్. గ్రేటర్‌కు ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం.. అభివృద్ధిలో హైదరాబాద్‌తో పోటీ పడుతోంది. కోవిడ్ టీకాను అందించిన భారత్ బయోటెక్ కొలువైంది ఇక్కడే. కండ్లకోయ ఐటీ పార్క్‌తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ దూసుకెళుతున్న సెగ్మెంట్ ఇది. అందుకే.. ఇక్కడ పాగా వేసేందుకు.. పొలిటికల్ పార్టీలన్నీ ఇప్పటి నుంచే స్కెచ్‌లు వేస్తున్నాయ్. ఇక్కడ గెలిస్తే చాలు.. కీలక పదవులు వరిస్తాయనే సెంటిమెంట్ కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన మర్రి చెన్నారెడ్డి.. ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్‌తో పాటు మాజీ మంత్రులు ఉమా వెంకట్రామిరెడ్డి, సురేందర్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి ఎన్నికైన వారే. ప్రస్తుతం.. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చామకూరు మల్లారెడ్డి సైతం.. కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.

Chamakura, Singireddy, Patlolla

మల్లారెడ్డి, హరివర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో మేడ్చల్ ఒకటి. ఒకప్పుడు 2 లక్షల జనాభా ఉన్న మేడ్చల్ సెగ్మెంట్‌లో ఇప్పుడు.. 5 లక్షల 53 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే.. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయ్. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేని విధంగా.. 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ముందు నుంచీ.. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కనిపిస్తోంది. ఇక్కడ.. 70 వేల దాకా వాళ్ల ఓట్లే ఉంటాయి. అందువల్ల.. మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లలో.. రెడ్లే ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో.. మేడ్చల్‌లో గులాబీ జెండా ఎగిరింది. 2014లో.. మలిపెద్ది సుధీర్ రెడ్డి గెలవగా.. గత ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. అన్ని ప్రధాన పార్టీల నుంచి రెడ్డి నేతలే ఇక్కడ టికెట్ రేసులో ఉంటున్నారు. ఇప్పుడు కూడా.. అన్ని పార్టీల నుంచి ఇద్దరు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. దాంతో.. మేడ్చర్ రాజకీయాల్లో టెంపరేచర్ బాగా పెరిగిపోయింది.

Chamakura Malla Reddy

చామకూర మల్లారెడ్డి

బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు
మేడ్చల్‌లో అధికార బీఆర్ఎస్ నుంచి.. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి (Chamakura Malla Reddy)తో పాటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దాంతో.. పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువైపోయాయ్. ఇద్దరు నేతలు.. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి.. ఈసారి కూడా టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (Malipedhi Sudheer Reddy) సైతం.. గతంలో అధిష్టానం తనకిచ్చిన హామీ మేరకే.. టికెట్ తకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. అయితే.. ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు, గ్రూపు తగాదాలతో.. బీఆర్ఎస్ క్యాడర్‌ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది. మంత్రి మల్లారెడ్డి.. మేడ్చల్‌లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. సుధీర్ రెడ్డి బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని.. మల్లారెడ్డి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు తప్ప.. మేడ్చల్‌ని పట్టించుకోలేదనే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు.. మల్లారెడ్డి.. తనకు అధిష్టానం ఆశీస్సులున్నాయని.. టికెట్ ఖాయమని.. సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో.. ఆత్మీయ సమ్మేళనాలకు పిలవకుండా దూరం పెడుతున్నారు. సుధీర్ రెడ్డి తనయుడు శరత్ చంద్రారెడ్డి జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నా.. ఆయన్ని కూడా కార్యక్రమాలకు పిలవడం లేదనే టాక్ వినిపిస్తోంది. దాంతో.. రెండు వర్గాల మధ్య రోజురోజుకు వివాదం ముదురుతోంది.

Singireddy Hari Vardhan Reddy

సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

కాంగ్రెస్ టిక్కెట్ కోసం పోటాపోటీ
మేడ్చల్‌లో.. బీఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్. ఈ నియోజకవర్గం.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోకి రావడం.. దానికి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండటంతో.. ఇక్కడ.. కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో ఇద్దరు నేతలు ఉన్నారు. మూడు చింతలపల్లి జడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి (Singireddy Hari Vardhan Reddy).. టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసే అవకాశం తానే దక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఇవే.. తనకు చివరి ఎన్నికలంటూ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇక.. ఇదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున తోటకూర జంగయ్య యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన.. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీని వీడి.. కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ వెంట నడిచే నాయకుడిగా.. ఆయనకు గుర్తింపు ఉంది. టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు.. ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దాంతో.. క్యాడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. మొదట్నుంచి.. మేడ్చల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండటంతో.. ఈసారి పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం.. అధిష్టానం ఎవరికి ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. రాబోయే ఎన్నికల్లో.. మేడ్చల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే ధీమా.. పార్టీ నాయకుల్లోనూ కనిపిస్తోంది.

Also Read: కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది?

Patlolla Vikram Reddy

పట్లోళ్ల విక్రమ్ రెడ్డి

బీజేపీ గెలుపు ఆశలు
మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్.. సెమీ అర్బన్ ఏరియా కావ‌డంతో బీజేపీ కూడా ఇక్కడ గెలుపు ఆశలు పెట్టుకుంది. సిటీ శివార్లలో ఉండటం, పార్టీ కొంత బలపడుతుండటంతో.. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉంది. ఇప్పటివరకు.. ఒక్కసారి కూడా మేడ్చల్‌లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేదు. దాంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈసారి మేడ్చల్ సీటు గెలిచి తీరాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఒక్క చాన్స్ ఇస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని.. నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను.. జనంలోకి తీసుకెళ్తున్నారు బీజేపీ నాయకులు. మేడ్చల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో.. జిల్లా ప్రెసిడెంట్ పట్లోళ్ల విక్రమ్ రెడ్డి(Patlolla Vikram Reddy)తో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన కొంపల్లి మోహన్ రెడ్డి.. రేసులో ఉన్నారు. బీజేపీలోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతుండటంతో.. క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినందున.. ఈసారి తనకు చాన్స్ ఇవ్వాలని.. విక్రమ్ రెడ్డి కోరుతున్నారు.

Also Read: సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ ఈసారి జెండా ఎగరేస్తుందా?

Teenmar Mallanna

తీన్మార్ మల్లన్న

మేడ్చల్ బరిలో తీన్మార్ మల్లన్న
ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కనబెడితే.. మిగతా పార్టీలు కూడా మేడ్చల్ సెగ్మెంట్‌పై కన్నేశాయి. ఒకప్పుడు ఇక్కడ వరుస విజయాలు సాధించిన టీడీపీ కూడా బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. అలాగే.. బీఎస్పీ, వైఎస్సార్‌టీపీ (YSRTP) కూడా బరిలో నిలవాలని చూస్తున్నాయి. వీరితో పాటు బీజేపీని వీడి.. కొత్త పార్టీ పెడతానని చెబుతున్న.. తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కూడా మేడ్చల్ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. ఇలా.. అంతా మేడ్చల్ మీదే ఫోకస్ చేయడంతో.. ఇక్కడి పోరు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ.. ఫోకస్ పెంచేశాయి. నేతలంతా.. విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిత్యం.. జనంలోనే కనిపిస్తున్నారు. ఇక.. సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని బీఆర్ఎస్.. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్.. బోణీ కొట్టాలని.. బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల మధ్య.. మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపిస్తుందన్నది.. ఆసక్తిగా మారింది.