Akbaruddin Owaisi: రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే- అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్
మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ.
Akbaruddin Owaisi Representative Image (Image Credit To Original Source)
- ముఖ్యమంత్రుల దగ్గరికి మేము వెళ్లం, ముఖ్యమంత్రులే మా దగ్గరికి వస్తారు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా?
- మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం
Akbaruddin Owaisi: కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు సత్తా చాటుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రుల దగ్గరికి మేము వెళ్లం, ముఖ్యమంత్రులే మా దగ్గరికి వస్తారని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా అని ప్రశ్నించారు. రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో 48 గంటల ముందే అన్ని రకాల ప్రచారాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ర్యాలీలు, సభలు, ఊరేగింపులతో పాటు టీవీ, సినిమా, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని ఎస్ఈసీ హెచ్చరించింది.
మరోవైపు సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేస్తారు.
ఈ నెల 11న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 2వేల 996 వార్డులకు గాను 12వేల 993 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 52 లక్షల మందిపైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 26 లక్షలు కాగా, పురుష ఓటర్ల సంఖ్య 25 లక్షలు.
Also Read: తెలంగాణలో పురపోరు అయిపోగానే.. పదవుల భర్తీ? మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులెవరికి?
