Ponnam Prabhakar: తెలంగాణ తల్లి ఓ వ్యక్తికి, కుటుంబానికి పరిమితం కాదు: పొన్నం ప్రభాకర్
తెలంగాణ సెంటిమెంట్ కి అనుగుణంగా తమ ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతాన్ని అధికారికంగా ప్రకటించామని అన్నారు.

శాసన సభలో తెలంగాణ తల్లి విగ్రహంపై జరిగిన చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. తెలంగాణ రావడానికి కారకురాలు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అని అన్నారు. ఆమె చొరవ చూపకుంటే తెలంగాణ రాకపోయేదని చెప్పారు. డిసెంబర్ 9 న తెలంగాణ ఏర్పాటు ప్రకటించిన సందర్భంగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలని వ్యాఖ్యానించారు.
తెలంగాణ చిహ్నంపై చర్చ జరుగుతోందని అన్నారు. తెలంగాణకు అధికారిక గేయం లేదని చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ కి అనుగుణంగా తమ ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతాన్ని అధికారికంగా ప్రకటించామని అన్నారు.
“తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా అధికారికంగా లేదు. అది ఒక పార్టీకి సంబంధించిన అప్లికెటెడ్ తప్ప రాష్ట్ర అధికారిక విగ్రహం కాదు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించుకుంటున్నాం.
తెలంగాణకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. వ్యక్తికి, కుటుంబానికి పరిమితం కాదు తెలంగాణ తల్లి. 10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదు? విగ్రహాలు ప్రతి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లలో, పోలీస్ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం” అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.