అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ.. టీచర్లకు కొత్త సెల్ ఫోన్లు.. బడి గంట తరహాలో బెల్స్.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి
అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రతను మెరుగుపర్చుకునే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

Anganwadi: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు గుడ్ న్యూస్.. చిన్నారులకు ప్రస్తుతం అందిస్తున్న ఆహార పదార్థాలను మరింత రుచికరంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూలో మార్పులు తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు.
రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధోమథనం సదస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంగన్ వాడీ చిన్నారులకు అందజేసే స్నాక్స్, బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని, గత ఏడాది కంటే ఈ ఏడాది 25శాతం అడ్మీషన్లు పెరిగేలా సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు.
అదేవిధంగా బడి గంట తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్ విధానాన్ని తీసుకురావాలని, పొద్దున గంట మోగిస్తే చిన్నారుల్లో ఉత్సాహం, క్రమశిక్షణ పెరుగుతుందని తెలిపారు.
అంగన్ వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రతను మెరుగుపర్చుకునే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు గ్రీన్ ఛానల్ లో ప్రతినెలా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వారిలో పని ఒత్తిడి తగ్గించేందుకు త్వరలో 14వేల ఖాళీలను భర్తీ చేస్తామని, అయితే, ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తికావాల్సి ఉండగా.. ఎస్సీ వర్గీకరణ కారణంగా లేట్ అయిందని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.
ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్ వాడీ కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. త్వరలో టీచర్లకు కొత్త సెల్ ఫోన్లు అందజేస్తామని తెలిపారు. అంగన్ వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు ‘అమ్మమాట అంగన్‌వాడి బాట’ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.