Mlas Defection Case: హైకోర్టుకు బీఆర్ఎస్.. స్పీకర్ తీర్పును సవాల్ చేయాలని నిర్ణయం..

పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

Mlas Defection Case: హైకోర్టుకు బీఆర్ఎస్.. స్పీకర్ తీర్పును సవాల్ చేయాలని నిర్ణయం..

Updated On : December 17, 2025 / 6:10 PM IST

Mlas Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాల్ చేయనుంది బీఆర్ఎస్.

కాగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు స్పీకర్. ఒక్కొ ఎమ్మెల్యేకు విడివిడిగా తీర్పు వెలువరించారు స్పీకర్. ఐదుగురిని శాసనసభ సభ్యులుగా పరిగణిస్తున్నాం అంటూ ప్రకటన చేశారు. తీర్పు కాపీ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ అడ్వకేట్లు అడగ్గా.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని స్పీకర్ చెప్పినట్లు వివేకానంద గౌడ్ తెలిపారు. అటు.. స్పీకర్ నిర్ణయంపై కేసీఆర్, కేటీఆర్ తో పిటిషనర్లు ఫోన్ లో మాట్లాడారు. స్పీకర్ జడ్జిమెంట్‌ను కేసీఆర్, కేటీఆర్‌లకు పిటిషనర్లు వివరించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎమ్మెల్యేలు వివరించారు. అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి.. స్పీకర్ తీర్పును వివరించారు కేటీఆర్. హైకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్ ఆదేశించారు. దాంతో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లనుంది బీఅర్ఎస్.

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించినట్టు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా, పలు దఫాల్లో ఆయన విచారణ జరిపారు. ఐదుగురికి సంబంధించి తీర్పు వెలువరించారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టుగా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ అభిప్రాయపడ్డారు. అందుకే వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేశారు. ఆ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు(డిసెంబర్ 18) నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఆగ్రహం

స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డం ప్రసాద్.. స్పీకర్ పదవికి అగౌరవం తెచ్చారని, రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని పాటించకుండా తనకు నచ్చినట్టు తీర్పు చెప్పారని ఆరోపించారు. మిగిలిన సభ్యులకు సంబంధించి కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. రేపు స్పీకర్ మిగిలిన వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూసిన తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని వివేకానంద గౌడ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ తో అంటకాగినట్టు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వారు ఏ పార్టీకి అనుకూలంగా పనిచేశారో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. అలాగే, తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి వారు ప్రయత్నించారని ఆరోపించారు.

రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ- స్పీకర్ నిర్ణయంపై హరీశ్ రావు ఫైర్

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పుపై మాజీమంత్రి హరీశ్ రావు స్పందించారు. రాహుల్ గాంధీ “సేవ్ ద కాన్‌స్టిట్యూషన్” నినాదం అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో నేడు పూర్తిగా బహిర్గతమైందన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమే అని హరీశ్ రావు అన్నారు.

ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని నిర్లజ్జగా ధిక్కరించడం.. ఇదీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపం అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. “సేవ్ ద కాన్‌స్టిట్యూషన్” నినాదం మాటలకే పరిమితమై, ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ఇది ఎంతో సిగ్గుచేటు, ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ అని వ్యాఖ్యానించారు.

Also Read: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం.. అనర్హత పిటిషన్ల కొట్టివేత