దళిత యువతిపై అత్యాచారంలో..సినీ నటులు, యాంకర్లు, విద్యార్థి సంఘం నాయకులు

దళిత యువతిపై జరిగిన అత్యాచారం ఘటనలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. 11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారంటూ ఆ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదులో సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అత్యాచారం చేసిన వారిలో సినీ నటులు, యాంకర్లు, విద్యార్థి సంఘ నాయకులున్నట్లు ఆమె ఆరోపిస్తోంది.
కొన్ని ఏళ్లుగా జరిగిన ఈ ఘోరం వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. యువతి ఫిర్యాదు మేరకు 143 మందిపై కేసు నమోదు చేశారు. గాడ్ పవర్ ఫౌండేషన్ సంస్థ వారిని కలిశానని, వారిచ్చిన ధైర్యం, సహకారంతోనే పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఈ మేరకు 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పంజాగుట్ట పోలీసులు.
అసలు ఏం జరిగింది. ?
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామంలో ఓ దళిత యువతి నివాసం ఉంటోంది. ఈమెకు మిర్యాలగూడ నివాసితో 2009 వివాహం జరిగింది. కానీ అత్తింట్లిలో అడుగుపెట్టిందో లేదో వేధింపులు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజులు భరించింది. వేధింపులు అధికమవడంతో ఒక్క
సంవత్సరంలోనే 2010లో భర్త నుంచి విడాకులు తీసుకుంది.
విద్యార్థి సంఘ నాయకుడు అత్యాచారం
తల్లిదండ్రుల వద్దే ఉంటూ..చదువుకుంటూ ఉండేది. ఈ క్రమంలో…కొంతమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఓ విద్యార్థి సంఘానికి నాయకుడైన ఒకరు..ఈమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది. నగ్నంగా ఫొటోలు తీసి వేధింపులకు, బెదిరింపులకు పాల్పడ్డాడు.
వేధింపులు..
హైదరాబాద్ కు మకాం మార్చినా వారి నుంచి వేధింపులకు ఫుల్ స్టాప్ పడలేదు. బెదిరించి..లొంగదీసుకుని ఇతరులు అత్యాచారానికి పాల్పడేవారని ఆ యువతి వాపోయింది. మొత్తం 11 ఏళ్లలో 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారని కంప్లైట్ లో వెల్లడించింది. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని తెలిపింది.
100 పేజీల ఫిర్యాదు
అత్యాచారానికి పాల్పడిన వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలు, సినీ నటులు, టీవీ యాంకర్లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఏకంగా 100 పేజీలో ఉందని సమాచారం. ఇతర రాష్ట్రాలకు తిప్పుతూ..తనపై అత్యాచారానికి పాల్పడే వారని, తనకు ప్రాణభయం ఉందని తెలిపింది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరి ఆ దళిత యువతిపై ఎవరెవరు అత్యాచారానికి పాల్పడ్డారో విచారణలో తేలనుంది.