Mulugu Area Hospital : రూ.4 వేలు ఇస్తేనే కరోనా డెడ్ బాడీ ప్యాకింగ్ చేస్తామన్న సిబ్బంది…ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో వసూళ్ల దందా
కరోనా కష్టకాలంలోనూ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా ఆగడం లేదు. ఆస్పత్రుల్లో అడుగు పెట్టిన సమయం నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్లకు ఓ రేటు, డెడ్ బాడీతో బయటకు వచ్చిన వాళ్లకు మరో రేటు.

Mulugu District Area Hospital Staff Demanded Money To Pack Coronas Dead Body
Mulugu Area Hospital : కరోనా కష్టకాలంలోనూ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా ఆగడం లేదు. ఆస్పత్రుల్లో అడుగు పెట్టిన సమయం నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్లకు ఓ రేటు, డెడ్ బాడీతో బయటకు వచ్చిన వాళ్లకు మరో రేటు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ములుగు జిల్లాలో ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకాన్ని 10టీవీ బయటపెట్టింది.
కరోనా మృతదేహాన్ని ప్యాక్ చేసేందుకు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే ప్యాక్ చేయమని తేల్చి చెప్పారు. పేదవాళ్లమని చెప్పినా మహిళా సిబ్బంది కనికరించలేదు.
4 వేల రూపాయలు ఇస్తేనే మృతదేహాన్ని కవర్ తో ప్యాక్ చేస్తామని, అంబులెన్స్ వరకు తరలిస్తామని తేల్చి చెబుతున్నారు. అసలే మనిషి పోయాడన్న బాధలో ఉన్న వారిని ప్రభుత్వాస్పత్రి సిబ్బంది రాబందుళ్లా పీక్కుతుంటున్నారు.
ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలోనిది. రేగొంట మండలం పోచంపల్లికి చెందిన ఓ మహిళ నాలుగు రోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. బంధువులు మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆస్పత్రి సిబ్బందిని కోరారు.
అయితే మృతదేహం ప్యాకింగ్, శానిటైజేషన్ కోసం 4 వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఇస్తేనే ప్యాక్ చేసి, అంబులెన్స్ వరకు తరలిస్తామని చెప్పారు. అయితే తాము కూడా ఇదే ఆస్పత్రిలో పని చేసే వాళ్లమని మృతురాలి బంధువులు తెలిపారు. అయినప్పటికీ డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని ప్యాకింగ్ చేస్తామని తేల్చి చెప్పారు.