ప్రధాని మోదీతో మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర రావు.. గంట పాటు సమావేశం..
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ముచ్చటించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చర్చ జరిగింది.

Pm Modi – Jupally Rameswar Rao : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మై హోమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ప్రధాని మోదీని డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, రామురావు ఘనంగా సత్కరించారు. ప్రధాని మోదీకి శాలువా కప్పారు. అలాగే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ జ్ఞాపికను బహూకరించారు. ప్రధాని మోదీ.. జూపల్లి రామేశ్వరరావు, రామురావుతో ఆపాయ్యంగా మాట్లాడారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ 2022లో హైదరాబాద్ లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ప్రారంభించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విలువలు ఉన్న నేతగా ప్రధాని మోదీకి గుర్తింపు ఉంది. ప్రజల కోసం అంకిత భావంతో పని చేసే నాయకుడిగా పేరు పొందారు. అటు ఆధ్యాత్మికంగా ఇటు రాజకీయంగా ప్రధాని మోదీ.. మొదటి స్థానంలో నిలవడంతో పాటు ప్రపంచంలో బలమైన నాయకుడిగా ఎదిగారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ముచ్చటించారు. మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రధాని మోదీ అభినందించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చర్చ జరిగింది.