Konda Surekha: కేటీఆర్ కేసులో మంత్రి కొండా సురేఖకు షాక్..! క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం..

Konda Surekha
Konda Surekha: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు చుక్కెదురైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాధమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. ఈ నెల 21లోపు మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
క్రిమినల్ కేసు నమోదు చేసి కొండా సురేఖకి నోటీసు జారీ చేయాలంది కోర్టు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించింది. కేటీఆర్ పై కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుతో పాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్టు గుర్తించింది కోర్టు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఓ సినీ కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. అప్పట్లో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. రాజకీయవర్గాల్లో మంటలు రాజేసింది. తనపై మంత్రి చేసిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆయన కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై క్రిమిల్ దావా చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.