తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన కొత్త సంవత్సరం వేడుకలు.. ఉదయాన్నే కిటకిటలాడిన ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లలో పెద్దెత్తున ప్రజలు పాల్గొని సందడి చేశారు. అర్ధరాత్రి వేళ కేక్ లు కట్ చేసి ..

New Year Celebrations
New Year 2025 Celebrations: నూతన సంవత్సరం వేడుకలు అంబరాన్నితాకాయి. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి 1గంట వరకు దేశవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు న్యూఇయర్ వేడుకల్లో సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ.. బాణాసంచా పేలుళ్ల మధ్య 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణం ఇలా పలు నగరాల్లో యువత న్యూ ఇయర్ వేడుకల్లో సందడి చేశారు.
Also Read: 2025 ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. ట్విటర్‌లో ప్రత్యేక వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లలో పెద్దెత్తున ప్రజలు పాల్గొన్నారు. అర్ధరాత్రి వేళ కేక్ లు కట్ చేసి న్యూఇయర్ వేడుకల ఘనంగా జరుపుకున్నారు. అర్థరాత్రి వేళ యువత రోడ్లపైకి వచ్చి న్యూఇయర్ శుభాకాంక్షలు చెబుతూ.. బైక్ లపై చక్కర్లుకొట్టి సందడి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ నానక్‌రాంగూడలోని మైహోం అవతార్‌లో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. అందరూ ఒక్కచోట చేరి సందడిచేసి 2025కు స్వాగతం పలికారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా చిన్న పిల్లలు, పెద్దలకోసం వేరువేరుగా గేమ్ షోలు ఏర్పాటు చేశారు. రాత్రి 1గంటల వరకు న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా కంట్రీ క్లబ్ లో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.
Also Read: Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ 16 సార్లు నూతన సంవత్సర వేడుకలు.. ఎలాగంటే?
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ బాబిలోన్ పబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్ నిర్వాహకులు అధికంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు పబ్ పై దాడులు నిర్వహించి సౌండ్ సిస్టం సీజ్ చేయడంతోపాటు కేసు నమోదు చేశారు. మరోవైపు హైదరాబాద్ లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో 1,184 కేసులు నమోదయ్యాయి. జోన్ల వారిగా చూస్తే.. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదు కాగా.. సౌత్ ఈస్ట్ జోన్లో 192 కేసులు, వెస్ట్ జోన్లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి.
2025 సంవత్సరం తొలిరోజు కావడంతో ఇవాళ ఉదయాన్నే పెద్దెత్తున ప్రజలు ఆలయాలకు వెళ్లారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్దెత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికితోడు యాదగిరిగుట్టకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తగా.. తిరుమలలో ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. అదేవిధంగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంతో పాటు పలు ఆలయాలకు తెల్లవారు జామునే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు రద్దీగా మారాయి.