Vanajeevi Ramaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు.

Vanajeevi Ramaiah
Vanajeevi Ramaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. 2017లో రామయ్యను పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. రామయ్య మృతివార్త తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వనజీవి రామయ్య స్వస్థం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. ఆయన అసలు పేరు దరిపెల్లి రామయ్య. ఆయన మొక్కల ప్రేమికుడు. చిన్నతనం నుండి మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేశారు. దీంతో ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నారు. కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వేసవిలో అడవుల్లోకి వెళ్లి విత్తనాలను సేకరించి వాటిని నిల్వచేసి తొలకరి సమయంలో ఆ విత్తనాలను ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపులా చల్లుతుండేవారు. అవి పెరిగి భారీ వృక్షాలయ్యాయి.
ఆయన ఎటువెళ్లినా ‘వృక్షోరక్షతి.. రక్షిత:’ అని రాసిన ఓ అట్టముక్కను తన మెడలో వేసుకొని వెళ్లేవారు. తాను ప్రయాణించే స్కూటీకి ముందు భాగంలో ఎప్పుడూ వృక్షో రక్షతి రక్షిత: అని రాసిన బోర్డు ఉంటుంది. బండికి ఇరువైపుల మొక్కలు ఉండేవి. ప్రతీఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలను పెంచాలని నిత్యం ప్రచారం చేశారు. ఆయన మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లే పెట్టాడంటే ఆయనకు మొక్కలపై ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకృతి పర్యావరణంలేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి, వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని కొనియాడారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య అని, వారి మరణం సమాజానికి తీరని లోటు అని రేవంత్ పేర్కొన్నారు. రామయ్య కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేశారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని రేవంత్ రెడ్డి అన్నారు.