పటాన్‌చెరు కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట.. ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా లీడర్ల వైఖరి
పటాన్‌చెరు నియోజకవర్గంలో పార్టీ మూడు గ్రూపులుగా విడిపోవడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది.

పటాన్ చెరు కాంగ్రెస్‌లో వర్గ పోరు పీక్ లెవల్‌కు చేరింది. నేతల మధ్య సఖ్యత లేక..ఒకరంటే ఒకరికి గిట్టని వైఖరితో ఉన్న నాయకుల వ్యవహార శైలి కార్యకర్తలకు అయోమయం కలిగిస్తుంది. పార్టీ పవర్‌లో ఉన్నా..యాక్టివ్‌గా పనిచేయలేకపోతున్నామని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారట. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ చేరాక పటాన్‌చెరు కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాట అయిపోయిందట. మెదక్ ఎంపీగా పోటీ ఓడిన నీలం మధు, ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్‌కు , గూడెం మహిపాల్ రెడ్డి మధ్య ఏ మాత్రం సఖ్యత కన్పించడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే చేసే కార్యక్రమాల్లో ఆమధ్య అడపాదడపా నీలం మధు కనిపించేవారు. ఇప్పుడు ఆయన కూడా యాక్టివ్‌గా లేనట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్యే కూడా వీరిద్దరికీ సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా..
గూడెం కాంగ్రెస్‌లో చేరినప్పటికీ అంత సంతృప్తిగా లేరట. హస్తం పార్టీ వ్యవహారాలు ఆయనకు మింగుడు పడటం లేదంటున్నారు. సైలెంట్ అయిపోవడంతో ఆయన వర్గం పూర్తిగా నైరాశ్యంలో ఉండిపోయింది. కాట వర్గీయులు కొందరు నీలం మధు వర్గంలో చేరిపోయి కార్యక్రమాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే గూడెంతో పాటు కాంగ్రెస్‌లో చేరిన అమీనుపూర్ మున్సిపల్ ఛైర్మన్ కూడా పార్టీ మారి తప్పుచేశానన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారట.
పటాన్‌చెరు నియోజకవర్గంలో పార్టీ మూడు గ్రూపులుగా విడిపోవడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది. మరోవైపు నియోజకవర్గానికి మంత్రులెవరు వచ్చినా తనకు సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వాపోతున్నారు. ఇటీవల కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ చిట్కుల్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ ఇద్దరూ డుమ్మా కొట్టగా..నీలం మధు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఇక జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కార్యక్రమాల సమాచారం కూడా అందటం లేదని గూడెం పెదవి విరుస్తున్నారట.
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్‌లో ఉన్న నీలం మధుకు, గూడెం మహిపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉండేవి. ఈ ఇద్దరినీ ఎదుర్కొని నిలిచిన కాట శ్రీనివాస్ గౌడ్‌కు..వీళ్లిద్దరు కాంగ్రెస్‌లో చేరడం మింగుడు పడటం లేదు. ఒకే ఒరలో రెండు కాదు మూడు కత్తులు అయిపోయాయి. అందుకే ఇమడలేకపోతున్నారు నేతలు. ఆ మధ్య రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడంతో పాటు ప్రోటోకాల్ రగడ తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న నీలం మధు, గూడెం మహిపాల్ రెడ్డిలు ఆరోజు ఒకే వేదికపై కనిపించడం, మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న కాట మాత్రం దూరంగా ఉండిపోవటం హాట్ టాపిక్ అయింది.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..కాంగ్రెస్‌లో చేరిక కార్యక్రమానికి కూడా కాట శ్రీనివాస్ గౌడ్ డుమ్మా కొట్టారు. నీలం మధు మాత్రం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూ పార్టీ క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సీనియర్లతో విభేదాలు లేకుండా జాగ్రత్త పడుతూ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. పటాన్‌చెరులో బలంగా ఉన్న బీఆర్ఎస్‌ను ఢీకొట్టాలంటే ఈ ముగ్గురి నేతల మధ్య సఖ్యత లేకపోతే కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ఈ గందరగోళ పరిస్థితులు చక్కబడాలంటే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలంటున్నారు ద్వితియ శ్రేణి నేతలు.
కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి అనుమతి దొరికేనా? గవర్నర్ ఢిల్లీ టూర్ ముగిశాక ఏం జరగబోతుంది?