PM Modi – Cm Revanth: మీరు కోరినట్లే చేస్తే తెలంగాణకు సగం నిధులే వస్తాయి- సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ కౌంటర్
రేవంత్ రాజకీయాలు మాట్లాడను అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడను. పదేళ్లు మాకు సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు.
PM Modi – Cm Revanth: హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన మీటింగ్ లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు మాట్లాడబోను అంటూనే రేవంత్ కు చురకలు అంటించారు ప్రధాని మోదీ. చమత్కారాలతో రేవంత్ పై సెటైర్లు వేశారు. ఇద్దరి మధ్య సున్నితమైన సంవాదం నడిచింది. గుజరాత్ కు నాడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ సహకరించినట్లే.. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా తెలంగాణకు సహకరించాలన్న రేవంత్ వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. నాడు మన్మోహన్ లా ఇప్పుడు తెలంగాణకు ఇవ్వాలంటే, మీకు సగం నిధులే వస్తాయని రేవంత్ తో చెప్పారు.
పదేళ్లలో గుజరాత్ కు ఇచ్చినంతే తెలంగాణకూ ఇవ్వడానికి రెడీ అన్నారు ప్రధాని మోదీ. అయితే, అలా ఇస్తే మీకే డబ్బులు తక్కువ వస్తాయన్నారు. తాము ఇవ్వాలని అనుకున్న దానిలో సగమే వచ్చే అవకాశం ఉందన్నారు. మీరు ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నారు అన్న మోదీ… అక్కడికి వెళ్లాలంటే నాతో కలిసి నడవాలని సీఎం రేవంత్ కు సూచించారు. రేవంత్ రెడ్డి తన మాటలు జాగ్రత్తగా వినాలన్నారు. అభివృద్ధి కోసం హమ్ సే జోడో (మాతో కలిసి రావాలి) అని రేవంత్ కు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆరోజు గుజరాత్ కి చేసిన కేటాయింపులకు రెట్టింపు తెలంగాణకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అందుకే మాతో కలవండి అంటూ నవ్వుతూ రేవంత్ కి సలహా ఇచ్చారు మోదీ. హమ్ సే జోడో అని ప్రధాని అనగానే ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరబూశాయి. ప్రధాని మోదీ చమత్కారాలకు సీఎం రేవంత్ సహా అంతా సరదాగా నవ్వుకున్నారు.
”రేవంత్ రాజకీయాలు మాట్లాడను అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడను. పదేళ్లు మాకు సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. పదేళ్లు మీరు కోరినట్టు గుజరాత్ తరహాలో సహకారం అందిస్తే ఇప్పుడు వచ్చే నిధులు సగమే వస్తాయి. అవి మీకు సరిపోతాయా? నాతో (కేంద్రం) వివాదాలు పెట్టుకోవద్దు. అభివృద్ధి కోసం నాతో కలిసి నడువు” అని సీఎం రేవంత్ కు హితవు పలికారు ప్రధాని మోదీ.
