పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం, కేంద్ర నిధుల సాధనే ప్రధాన లక్ష్యం

  • Published By: naveen ,Published On : November 2, 2020 / 12:41 PM IST
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం, కేంద్ర నిధుల సాధనే ప్రధాన లక్ష్యం

Updated On : November 2, 2020 / 1:12 PM IST

polavaram authority : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల సాధనే లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం అయ్యింది. సోమవారం(నవంబర్ 2,2020) హైదరాబాద్‌లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో.. అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఏపీ నుంచి జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు.. ఉభయ రాష్ట్రాల నుంచి ఏడుగురు అధికారులు హాజరయ్యారు. పోలవరం తాజా ధరల ప్రకారం నిధులు సమకూర్చే విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇవాళ్టి (నవంబర్ 2,2020) సమావేశంలో సవరించిన అంచనాల సిఫారసులపై అధికారులు ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదించినట్లు పోలవరం ప్రాజెక్టు రెండవసారి సవరించిన అంచనా వ్యయానికే ఇన్వెస్టిమెంట్‌ క్లియరెన్స్‌ జారీ చేయాలని పీపీఏను ఏపీ సర్కార్‌ కోరనుంది. 2017-18లో టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ 55 వేల 548 కోట్లకు ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని పీపీఏను కోరింది ఏపీ ప్రభుత్వం.

అయితే 2013-14 ధరల ప్రకారం నిధులు 20 వేల 398 కోట్లుగా నిర్ధారించి ఆమోదిస్తే 2 వేల 234 కోట్లు రీయింబర్స్‌మెంట్ చేస్తామంది కేంద్రం. దీనిపై పీపీఏ అభిప్రాయం కోరింది. దీంతో కేంద్రం ప్రతిపాదనలపై ఏపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 2017-18 ధరల ప్రకారం రెండవసారి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి.. ఇప్పుడు 2013-14 ధరలను తెరపైకి తేవడం సరికాదంటోంది.
https://10tv.in/minister-anil-fires-on-chandrababu-over-polavaram/