బుర్ఖాతో వచ్చి జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి యత్నం కేసు.. నిందితుల అరెస్ట్.. వివరాలు తెలిపిన పోలీసులు

Gold Shop: దోపిడీకి పాల్పడుతున్న సమయంలో షాప్ ఓనర్ కేకలు పెట్టారని, దీంతో నిందితులు..

బుర్ఖాతో వచ్చి జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి యత్నం కేసు.. నిందితుల అరెస్ట్.. వివరాలు తెలిపిన పోలీసులు

మేడ్చల్‌లోని ఓ జ్యువెలరీ షాప్‌లోకి బుర్ఖా వేసుకుని వచ్చి ఇద్దరు దోపిడీకి ప్రయత్నించి కేసును పోలీసులు ఛేదించారు. సైబరాబాద్ సీపీ అవినాశ్ మహతి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. జ్యువెలరీ షాప్‌లో చోరీ చేయడానికి ఆ ఇద్దరు విఫలయత్నం చేశారని వివరించారు.

మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు నిందితులు జ్యువెలరీ షాప్‌లోకి చొరబడ్డారని చెప్పారు. ఆ క్రమంలో షాప్ యజమానులకు చంపడానికి కూడా వెనకాడ లేదని తెలిపారు. దోపిడీకి పాల్పడుతున్న సమయంలో షాప్ ఓనర్ కేకలు పెట్టారని, దీంతో నిందితులు దాడి చేసి పరారయ్యారని తెలిపారు.

ఈ కేసులో ముగ్గురి భాగస్వామ్యం ఉందని చెప్పారు. నిందితులు హైదరాబాద్ కు సంబంధించిన వారేనని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నజీమ్ అజీజ్ కొటాడియా, షేక్ సోహెల్ అని చెప్పారు. నిందితులు దోపిడీ కోసం చోరీ చేసిన బైకును వాడారని తెలిపారు. నిందితులు ఆ బైకును ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేశారని చెప్పారు.

జ్యువెలరీ షాప్ వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారని అన్నారు. నిందితులను పట్టుకోవడం కోసం సుమారు 200 సీసీకెమెరాలను పరిశీలించామని తెలిపారు. ఇటీవల చాదర్‌ఘాట్‌లో జరిగిన చోరీలోనూ నిందితుడు కోటాడియా పాత్ర ఉందని చెప్పారు. కోటాడియా, షేక్ సోహెల్ మధ్య స్నేహం జైలులో చిగురించిందని తెలిపారు. ఈ ఇద్దరు నిందితులకి సహకరించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు.

Also Read: కుప్పకూలిపోయిన బ్రిడ్జి.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు