Cyclone Montha : దిశ మార్చుకున్న మొంథా తుఫాన్.. తెలంగాణాకు తీవ్ర వాయుగుండం ముప్పు.. 16 జిల్లాలకు హైఅలర్ట్..
Cyclone Montha ఏపీని అతలాకుతలం చేస్తున్న మొంథా తుపాను దిశ మార్చుకుంది. తెలంగాణ వైపు దూసుకొస్తోంది. ఈ క్రమంలో 16 జిల్లాలకు ప్లాష్ ప్లడ్ ముప్పు ఉన్నట్లు ..
Cyclone Montha
Cyclone Montha: మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎంఏ) ప్రకటించింది. అయితే, తీవ్ర తుపాను బుధవారం మధ్యాహ్నం తుపానుగా మారింది.. ఇవాళ సాయంత్రం వాయుగుండంగా బలహీనపడనుంది. ఈ క్రమంలోనే మొంథా తుపాను బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దిశ మార్చుకొని తెలంగాణ వైపు దూసుకొస్తోంది.
తీవ్ర వాయుగుండంగా బలహీన పడిన మొంథా తుపాన్.. భద్రాచలంకు ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు.. ఖమ్మంకు తూర్పున 110 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర – వాయువ్య దిశగా ప్రయణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మొంథా తుపాను తీవ్ర వాయుగుండంగా మారి దిశ మార్చుకోవడంతో.. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 16 జిల్లాలకు ప్లాష్ ప్లడ్ ముప్పు ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..
మొంథా తుఫాను తీరం దాటిన తురువాత తీవ్ర వాయుగుండంగా మారి దిశ మార్చుకున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడారు. రెండు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు, కీలక ఆదేశాలు చేశారు. మంగళవారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆధికారులు అప్రమత్తంగా ఉండాలని తమ్మల ఆదేశించారు.
రైతులు తమ పంటలను వర్షాల భారీనుండి కాపాడుకోవాలని, తొందరపడి పంటలను అమ్ముకోవొద్దని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని తుమ్మల సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలను వాగులు వంకలు దాటకుండా చూడాలని, అందుకోసం పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వర్ష ప్రభావంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా చెరువుల వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితిలో తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని ప్రజలకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
