అందుకే.. రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదు- మల్లు రవి కీలక వ్యాఖ్యలు
పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలవనుంది. అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు.

Mallu Ravi Slams BJP (Photo : Google)
Mallu Ravi : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. రామ మందిరం అంశాన్ని బీజేపీ తన పార్టీ కార్యక్రమం లాగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాముడు అందరివాడు అన్న మల్లు రవి.. రామరాజ్యం లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. గాంధీ, ఇందిర నుండి నేటి వరకు కాంగ్రెస్ ఆలోచనా విధానంతో ముందుకెళ్తోందన్నారు. రామ మందిర ప్రారంభం ఆహ్వానం ఉన్నా.. ట్రస్టుతో సంబంధం లేకుండా బీజేపీ తన పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందునే తాము వెళ్లలేకపోతున్నాం అని మల్లు రవి వివరించారు. రామ మందిరాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు.
”మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారు. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్ లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారు. ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Also Read : బీఆర్ఎస్‌లో హాట్ సీట్‌గా ఆ పార్లమెంటు నియోజకవర్గం.. సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక, కేసీఆరే పోటీ చేస్తారా?
తెలంగాణ రాష్ట్రాన్నికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లారు. 30 రోజుల పాలన ప్రజా రంజకంగా సాగింది. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. కొల్లాపూర్ లో మాజీమంత్రి కేటీఆర్ తప్పుడు సమాచారంతో అబద్దాలు మాట్లాడారు. వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన హత్యను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలవనుంది. అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు” అని విరుచుకుపడ్డారు మల్లు రవి.
Also Read : దావోస్‌లో సీఎం రేవంత్ బృందం ఎంతమంది పారిశ్రామిక వేత్తలను కలవనుంది.. పూర్తి వివరాలు ఇలా..