Hyderabad Roads: రతన్ టాటా రోడ్, డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ, గూగుల్ స్ట్రీట్.. హైదరాబాద్‌లో రోడ్లకు ప్రముఖుల పేర్లు..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లు రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు..
Hyderabad Roads: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పలు ప్రధాన రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 100 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. రావిర్యాల ఇంటర్ ఛేంజ్ కు ఇప్పటికే టాటా ఇంటర్ ఛేజ్ అని పేరు పెట్టారు. ఇక ప్రపంచంలోనే తొలిసారి ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రానికి, అమెరికా రాయబార కార్యాలయానికి లేఖలు రాయనుంది తెలంగాణ సర్కార్. ఐటీ కారిడార్ లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లు రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణించే వారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను దృష్టిలో ఉంచుకుని రేవంత్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ముందు ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా ప్రముఖుల పేర్లు పెట్టడం ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్ లో హైదరాబాద్ కు గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అలాగే, తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే ప్రణాళిక కూడా రచిస్తోంది సర్కార్.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరగనుంది. 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పడమే ప్రభుత్వం లక్ష్యం.
Also Read: పుతిన్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో ఖరీదైన ఫుడ్ ఐటెమ్ ఇదే.. ధర కేజీ 40వేలు..
