Real Estate Frauds : తక్కువ ధరకే విల్లాలు, ప్లాట్లు అంటూ ప్రచారాలు.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీల ఘరానా మోసాలు..
లేని స్థలాలు ఉన్నట్లు చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాయి.

Real Estate Frauds : హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు వరుసగా మూత పడుతున్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్స్, బై బ్యాక్ పాలసీ పేర్లతో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రజలను మోసం చేశాయి. దీంతో రియల్ ఎస్టేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడి మూతపడుతున్నాయి. ఆఫర్ల పేరుతో ప్రజల నుంచి దాదాపు రూ.3 వేల కోట్లు దండుకున్నాయి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు.
ఒక్క సైబరాబాద్ లోనే 22 ప్రీ లాంచ్ ఆఫర్, 12 బై బ్యాక్ పాలసీ పేరుతో పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. లేని స్థలాలు ఉన్నట్లు చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీంతో నగరంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీలు మూతపడుతూ వస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో రోజుకొక రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూస్తోంది. గడిచిన 10 రోజుల్లో పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థలు చేసిన మోసాలు బయటపడ్డాయి. ప్రీ లాంచ్, బై బ్యాక్ పాలసీ పేర్లతో దగా చేస్తున్నాయి. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని, అదే విధంగా ఇళ్లు ఇస్తామని నమ్మించి మోసానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ తరహా ఘటనలు తరుచుగా వెలుగుచూస్తున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ మోసాలు జరిగాయి.
భారీ వెంచర్లు, విలువైన భూములు చూపిస్తారు. ఇందులో పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామని ఆశ చూపి చివరికి మోసం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో సాహితి ఇన్ ఫ్రా కు సంబంధించిన బాధితులు ఇప్పటికీ న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. పేద, మధ్య తరగతి ప్రజల అమాయకత్వాన్ని, అవసరాలను పెట్టుబడిగా పెట్టుకుని రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయి. దీంతో బాధితులు రోడ్డున పడుతున్నారు.
Also Read : బీ కేర్ ఫుల్.. యాత్రల పేరుతో ఘరానా మోసం.. ఐదేళ్లలో రూ.15 కోట్లు వసూలు..