Harish Rao : కందులు పండించడమే ఆ రైతులు చేసిన నేరమా?- కాంగ్రెస్ సర్కార్ పై హరీశ్ రావు ఫైర్

మంత్రి ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి, చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి.

Harish Rao : కందులు పండించడమే ఆ రైతులు చేసిన నేరమా?- కాంగ్రెస్ సర్కార్ పై హరీశ్ రావు ఫైర్

Updated On : February 9, 2025 / 6:42 PM IST

Harish Rao : రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీమంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలన్నీ తుంగలో తొక్కిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్త మాటలే అని విమర్శించారు. సిద్దిపేట జిల్లా మాజీమంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

”రైతులు డబ్బుల కోసం పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో 400 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. బోనస్ తో కలిపి 7,900కు కొనాలి. రైతులు మిగతావి ఎక్కడ అమ్ముకోవాలి. కంది రైతుల మీద పగ ఎందుకు? రైతులు ఎంత పండిస్తే అన్ని క్వింటాల కందులు కొనాలని ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డిమాండ్ చేస్తున్నా.

కంది రైతుల మీద మీకెందుకు ఇంత కక్ష?
మంత్రి ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి, చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి. 48 గంటల్లో బోనస్ డబ్బులు వేస్తామన్నారు. 48 గంటలు కాదు.. 48 రోజులైనా బోనస్ డబ్బులు రాలేదు. కంది రైతుల మీద మీకెందుకు ఇంత కక్ష? కందులు పండించడం వారు చేసిన నేరమా? ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీల్లో కోతలు వేశారు. మీరు చేసిన తప్పునకు రైతులు ఎందుకు బలి కావాలి.

Also Read : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా డబ్బులు వేసే డేట్‌ ఇదే..

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో కంది సాగు అయితే, క్రాప్ బుకింగ్ దాదాపు నాలుగు లక్షల ఎకరాలు మిస్ అయ్యింది. వ్యవసాయ శాఖ చేసిన తప్పునకు పంట పండించిన రైతుల దగ్గర కందులు కొనటం లేదు. జిల్లా కలెక్టర్ల నుంచి వ్యవసాయశాఖకు ప్రతిపాదన పంపించారు. క్రాప్ బుకింగ్ లో మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండని జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖకు రాశారు. కానీ, ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వడం లేదు” అని హరీశ్ రావు ఆరోపించారు.

పాలాభిషేకాలు ఎందుకు చేయాలి?
48 గంటల్లో రైతులకు డబ్బులు ఇచ్చేశామని, సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయమని మంత్రి ఉత్తమ్ అంటున్నారు. ఎందుకు చేయాలి పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతుబంధు వేయనందుకు, సన్నవడ్లకు బోనస్ ఇవ్వనందుకు.. పాలాభిషేకాలు చేయాల్నా? రేపు మీరు ఊర్లలోకి ఏం అభిషేకాలు చేయాలో ప్రజలు చేసి చూపిస్తారో మీకు. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధిపేటలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రాష్ట్రమంతా మంత్రులు ప్రారంభించారు.

తీరా చూస్తే.. ఎకరానికి 3 క్వింటాలే కొంటారట. ఇదేమన్నా సగం పాలననా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఎన్ని కందులు పండిస్తే అన్ని కందులు మేము కొన్నాం. కానీ, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ సర్కార్, కోతల సర్కార్. ఎన్నికల సమయంలో అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని హామీలిచ్చారు. గెలిచాక.. కార్యక్రమాల అమలులో కోతలు. కందులు ఎకరానికి 6 నుంచి 10 క్వింటాళ్లు పండుతాయి రైతులకు. మంచిగా పండితే 10 క్వింటాళ్లు పండుతాయి. తక్కువలో తక్కువ 6 క్వింటాళ్లు పండుతాయి.

Also Read : మీర్‌పేట్ మాధవి కేసులో భారీ ట్విస్ట్.. ఇంతకాలం గురుమూర్తి ఒక్కడే అనుకున్నారు.. కానీ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెబుతోంది అంటే.. మీరు పాస్ బుక్ తీసుకురండి. వ్యవసాయశాఖ అధికారులు ఎకరంలో పండించారా అర ఎకరంలో పండించారా సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎకరం పండిస్తే అందులో 3 క్వింటాళ్లు మాత్రమే కొంటామంటోంది ప్రభుత్వం. మరి మిగతా 3 క్వింటాళ్లు రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? అని హరీశ్ రావు ప్రశ్నించారు.