Revanth Reddy: ఇందుకు సంబంధించిన ఆధారాలను వరుసగా బయటపెడతాం: రేవంత్ రెడ్డి
ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్, కేటీఆర్ పెడబొబ్బలు పెడుతున్నారని అన్నారు.

Revanth Reddy
Revanth Reddy – Dharani: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు కోదండ రెడ్డి(Kodanda Reddy), సంపత్ (Sampath), ఇతర నేతలు ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో భూమి డిక్లరేషన్ విడుదల చేశారు. ధరణిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ… ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోందని అన్నారు. దీని వెనక పెద్ద మాఫియా దాగుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సీరియల్ గా బయటపెడతామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆస్తులు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆరోపించారు.
ఇందులో బ్రిటిష్ ఐల్యాండ్ కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. ధరణి మొత్తం యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉందని ఆరోపించారు. ధరణిని అడ్డుపెట్టుకుని దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ చేస్తున్నారని అన్నారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయని చెప్పారు. ఆ వివరాలు అన్నీ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు.
ప్రజల వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయని అన్నారు. గజ్వేల్ లో 1,500 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం చట్టవిరుద్ధంగా లాక్కుందని తెలిపారు. అమూల్ డెయిరీకి వందల ఎకరాల కట్టబెట్టారని చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్ కు భూములు కేటాయించారని తెలిపారు.
హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారని చెప్పారు. ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్, కేటీఆర్ పెడబొబ్బలు పెడుతున్నారని అన్నారు. ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పారు.
త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడిందని ఆరోపించారు. రాజేందర్ అన్న (ఈటల రాజేందర్) ను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారని చెప్పారు. రాజేందర్ ను బీజేపీ మోసం చేసిందని తెలిపారు.
రాజేందర్ కు భద్రత పెంచినా… అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. తనకు ఎవరి వల్ల ప్రమాదం ఉందో ఈటల స్పష్టంగా చెప్పారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. తన రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం ఈటలకు మాత్రం భద్రత ఏర్పాటు చేయడం సంతోషమని ఎద్దేవా చేశారు.
TPCC President Revanth Reddy: ఆ రెండు పార్టీల కుట్రలను.. జన బలంతో తిప్పికొట్టాలి