Telangana PCC Chief : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజనీకుమార్ యాదవ్ లను నియమించారు.

Revanth Reddy Tpcc
Revanth Reddy as Telangana PCC Chief : తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ లను నియమించింది.
సీనియర్ వైస్ ప్రెసిండెంట్లుగా పదిమందిని నియమించింది. వారిలో చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, కొల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, కుమార్ రావ్, జావెద్ అమీర్, పోదెం వీరయ్య, సురేశ్ షెట్కర్ లను నియమించింది.
గత కొన్ని నెలల నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ పై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఎన్నోసార్లు పీసీసీ చీఫ్ ఎవరన్నది వాయిదా పడుతూ వచ్చింది. చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తూ వచ్చింది. గతంలోనే రేవంత్ రెడ్డికే తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందంటూ వార్తలు వచ్చాయి.
ఈ విషయంలో కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్ నేతలు అలకబూనడంతో పాటు పలువురు నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తిచేసిన పరిస్థితి నెలకొంది. దాంతో టీఎస్ పీసీసీ చీఫ్ ఎవరు అనేదానిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోలేకపోయింది.
ఆ తర్వాత తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా వాయిదా వేస్తూ వచ్చింది. ఒకసారి జీవన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. వీహెచ్ లాంటి సీనియర్ నేతలు బయట నుంచి వచ్చినవారిని ఎలా తీసుకుంటారంటూ అలకలుబూనారు.
ఇవన్నింటిని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేసుకుంటూనే వచ్చింది ఏఐసీసీ అధిష్టానం.. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. అప్పటినుంచి పీసీసీ చీఫ్ ఎవరికి అన్నది ఉత్కంఠ కొనసాగుతోంది.
ఎట్టకేలకు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం జరిగింది. దాంతో కాంగ్రెస్ క్యాడర్ లో కొత్త జోష్ నెలకొంది. సీనియర్లు వ్యతిరేకించినా రేవంత్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. మరోవైపు.. పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకంపై ఆయన మద్దతుదారులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.