చెట్టు నరికినందుకు రూ. 9వేలు జరిమానా

పర్యావరణ సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హరితాహారం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారులు కఠినంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే అనుమతి లేకుండా చెట్లను నరికితే సీరియస్‌గా రియాక్ట్ అయ్యి, భారీ జరిమానాలు విధిస్తున్నారు. లేటెస్ట్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సంజయనగర్ పంచాయతీలో కూడా ఈ మేరకు ఓ వ్యక్తికి చెట్లను నరికినందుకు రూ. 9వేలు జరిమానా విధించారు అధికారులు.
వివరాల్లోకి వెళ్తే.. సంజయ్‌నగర్ పంచాయతీ నుంచి చాతకొండకు వెళ్లే మార్గంలో మూడు భారీ వృక్షాలున్నాయి. అయితే అదే ప్రాంతంలో ఉండే చంద్రమౌళి ఆ చెట్లు తన ఇంటికి అడ్డంగా ఉన్నాయంటూ వాటిని నరికి వేయించాడు. సమాచారం అందుకున్న పంచాయతీ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. భారీ వృక్షాలను కూల్చి వేసినట్లు గుర్తించారు.
వెంటనే అందుకు కారణం అయిన చంద్రమౌళికి రూ.9వేలు జరిమానా విధించారు. అయితే ఆ సమయంలో చంద్రమౌళి ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు జరిమానా పత్రాన్ని అంటించారు అధికారులు.