RTC Rental Buses : ఇండియాలో ఫస్ట్ టైమ్.. ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇవ్వనున్న మహిళా సంఘాలు.. నెలకు ఒక్కో బస్సుకు రూ.77,220 ఆదాయం..
బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది ప్రభుత్వం.

RTC Rental Buses : మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. ఉపాధి కల్పనలో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనుంది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.77,220 చెల్లించనుంది ఆర్టీసీ.
బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది ప్రభుత్వం. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనుండటం దేశంలోనే తొలిసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్.
Also Read : వీడెవడండీ బాబూ.. కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం..
మహిళా స్వయం సహాయక బృందాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. మొదటి విడతలో 50 అద్దె బస్సులకు సీఎం చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
మొదటి దశలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో(మహబూబ్ నగర్, కరీంనగర్) మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను కేటాయిస్తారు. మొదటి దశలో మహిళా సంఘాల ద్వారా 150 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
Also Read : ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ గుడ్‌న్యూస్.. ఫీజు చెల్లిస్తే కేవలం 10 రోజుల్లో..
ఆర్టీసీ బస్సుల కొనుగోలు ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు మొదలైన అంశాలపై అధికారులు సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఉంది. ఈ విషయంలో, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలని, వారు కొనుగోలు చేసే బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.