Samatha Kumbh 2024: శ్రీ రామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలు.. ఏరోజు ఏం జరుగుతుందో తెలుసా?
ఇందులో భాగంగా 9 కుండాలతో ఒక యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ స్వామివారికి 18 మంది గరుత్మంతులతో..

Chinna Jeeyar Swamy
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్ 2024 నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి మార్చి 1 వరకు శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
సమతా కుంభ్ 2024కు శ్రీకారం చుట్టారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 25న 108 దివ్యదేశాల మూర్తులకు ఒకేసారి శాంతి కల్యాణం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 11 రోజుల పాటు జరిగే శ్రీ రామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలకు దేశవిదేశాల నుంచి భక్తులు హాజరవుతారు. మంగళవారం రామానుజాచార్యులకు అభిషేకంతో సమతా కుంభ్-2024 ప్రారంభమవుతుంది.
ఇందులో భాగంగా 9 కుండాలతో ఒక యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ స్వామివారికి 18 మంది గరుత్మంతులతో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న సూర్యప్రభ వాహనసేవతో పాటు శేష వాహన సేవ నిర్వహించనున్నారు. 25వ తేదీన 108 దివ్యదేశాల మూర్తులకు ఒకేసారి శాంతి కల్యాణం జరిపిస్తారు.
ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 11.30 గంటలకు వసంతోత్సవంతో పాటు సాకేత రామచంద్రప్రభువుకు గరుడ సేవ నిర్వహించనున్నారు. 27న డోలోత్సవం, అశ్వ వాహనసేవ జరిపిస్తారు. ఫిభ్రవరి 28న అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఫిబ్రవరి 29వ తేదీ ఉదయం 9గంటలకు శ్రీ సాకేత రామచంద్రప్రభువుకు రథోత్సవం, విరజా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మార్చి 1న శ్రీ పుష్పయాగం నిర్వహించి, సాయంత్రం మహా పూర్ణాహుతి కార్యక్రమంతో సమతా కుంభ్ -2024 ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల పాటు దేశ విదేశాల నుంచి వచ్చే కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సమతా భావాన్ని చాటిచెప్పేందుకు..
సమాజంలో సమానత్వం కోసం వెయ్యేళ్ల క్రితమే శ్రీ రామానుజాచార్య కృషి చేశారని, జాతి, మత, కులంతో సంబంధం లేకుండా దేవుడి ముందు అందరూ సమానమే అని చాటి చెప్పారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జియర్ స్వామి చెప్పారు. శ్రీ రామానుజాచార్య సమతా భావాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు, సమాజంలో సమాతా స్పూర్తిని నింపేందుకు 216అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.