ఫిబ్రవరి 01 నుంచి స్కూళ్లు, వారికి మాత్రమే – తెలంగాణ సర్కార్ నిర్ణయం

ఫిబ్రవరి 01 నుంచి స్కూళ్లు, వారికి మాత్రమే – తెలంగాణ సర్కార్ నిర్ణయం

Updated On : January 11, 2021 / 3:44 PM IST

Telangana Schools : పిల్లలు ఇక స్కూళ్లకు వెళ్లడానికి రెడీ కండి..కరోనా కారణంగా తాత్కాలికంగా మూత పడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు స్కూళ్లు తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే పలు రంగాలు తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా..పాఠశాలలు తెరుచుకోనే విషయంలో…తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకొనేందుకు ఒకే చెప్పింది. 09, ఆపై తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి 11వ తేదీ సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతిభవన్ లో సమావేశం జరుగుతోంది. రెవెన్యూ, పంచాయతిరాజ్, మున్సిపల్, వైద్య శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పాఠశాలల తెరవాలని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ల సమావేశంలో చర్చిస్తున్నారు. 16వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనుండటంతో వ్యాక్సినేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించనున్నారు. అదే విధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు తీరుతెన్నులపై సమీక్షించనున్నారు.