మరి అప్పుడు ఎందుకు కవితను బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్ చేయలేదు?: సీతక్క

Seethakka: "ప్రజల బంధం కంటే పేగు బంధమే కేసీఆర్ కు ముఖ్యం. కాళేశ్వరం మీద చర్చను డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా" అని అన్నారు.

మరి అప్పుడు ఎందుకు కవితను బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్ చేయలేదు?: సీతక్క

Seethakka

Updated On : September 3, 2025 / 5:12 PM IST

Seethakka: కల్వకుంట్ల కవిత సస్పెన్షన్, రాజీనామా అంతా రాజకీయ డ్రామా అని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సీతక్క మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు.

“తెలంగాణ జాతిపిత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేక పోతున్నారా? కేసీఆర్ అంత వీక్ అయ్యారని నేను అనుకోను. ఇది బీఆర్ఎస్ పార్టీ డ్రామా. బీఆర్ఎస్ అవినీతిని ఎవరైనా ప్రశ్నిస్తే పక్క వాళ్లు, పక్క రాష్టాల మీద నెపం నెట్టడం కేసీఆర్ ఫ్యామిలీకి అలవాటే.

పర్సన్స్ చేస్తున్న తప్పులను వ్యవస్థకు ఆపాదించి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే బీఆర్ఎస్‌ నేతలు దోచుకున్నారు, దాచుకున్నారు. నన్ను ఒడించడానికి వందల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబ బినామీ నా మీద ఖర్చు చేశారు.

కేటీఆర్ కు ఇందులో భాగస్వామ్యం లేదని నేను అనుకోవడం లేదు. ఈరోజు కేటీఆర్ ను కాపాడుతూ హరీశ్ రావు, సంతోష్ రావును కవిత విమర్శించారు. కుటుంబం అంతా కలిసి తెలంగాణను విధ్వంసం చేసింది.

రాష్ట్ర ప్రయోజనాలు వీళ్లకు పట్టవు. ఇన్ని రోజులు కలిసి పని చేసిన వ్యక్తి బయటకు వెళ్తే బీఆర్ఎస్ సంబురాలు చేసుకుంటోంది. కేసీఆర్ కు నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నీకు ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు.

ప్రజల బంధం కంటే పేగు బంధమే కేసీఆర్ కు ముఖ్యం. కాళేశ్వరం మీద చర్చను డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా. జగదీశ్‌ రెడ్డిని, మరో నాయకుణ్ణి విమర్శించినప్పుడు ఎందుకు కవితను సస్పెండ్ చేయలేదు?

కేసీఆర్ ఫ్యామిలీకి కృతజ్ఞత భావం ఉండదు. హరీశ్ తో డొంక తిరుగుడు సంబంధం మాకు అవసరం లేదు. దోచుకున్న డబ్బును పంచుకునే దగ్గర కేసీఆర్ కుటుంబ సభ్యులకు పంచాయితీ వచ్చింది. కేసీఆర్ మౌనం ఎవర్ని మోసం చేయడానికీ?” అని సీతక్క అన్నారు.