Cm Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు- సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

నేను ఎవరి మీద ఆరోపణలు చేయడం లేదు. ఎవరు ఏ పరిస్థితుల్లో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు అనే వివరాల జోలికి వెళ్లదలుచుకోలేదు.

Cm Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు- సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

Updated On : March 26, 2025 / 4:46 PM IST

Cm Revanth Reddy : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ అంశంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు, టీవీ నటులు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం విదితమే. పలువురిని విచారణకు కూడా పిలుస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

”ఈ నేరం ఒక రకంగా రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు ఉంది. వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు చెందిన నేరగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. టెంపరరీగా ఒక పోలీస్ స్టేషన్ లోనో లేక ఒక పరిధిలోనో విచారణ చేస్తే ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం లేదు కాబట్టి ఈ ఆన్ లైన్ బెట్టింగ్, ఆన్ లైన్ యాప్స్, ఆన్ లైన్ రమ్మీ లాంటి గేమ్స్ డిజిటల్ గా జరుగుతున్న గేమింగ్, బెట్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది.

Also Read : అప్సరను చంపి, డ్రైనేజీలో పూడ్చి, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపిన కేసు.. పూజారికి జీవిత ఖైదు

నేను ఎవరి మీద ఆరోపణలు చేయడం లేదు. ఎవరు ఏ పరిస్థితుల్లో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు అనే వివరాల జోలికి వెళ్లదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్స్ యాప్స్, ఆన్ లైన్ బెట్టింగ్, ఆన్ లైన్ రమ్మీ గేమ్స్ పట్ల అప్రమత్తగా ఉండటమే కాదు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీలైతే సీబీసీఐడీ కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేశాక ఒక సిట్ ను ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

 

”గతంలో చేసిన చట్టంలో రెండు సంవత్సరాలకంటే మించి శిక్ష లేదు. రేపు వచ్చే సమావేశాల్లో ఈ ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వాహాకులనే కాదు ఆడే వారిని, ఆన్ లైన్ యాప్స్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వారి పట్ల శిక్ష కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరముంది. శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అనేది ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

అదే విధంగా గుట్కా వంటి నిషేధిత పదార్ధాలను కూడా ఈరోజు మార్కెట్ లో సరఫరా జరుగుతోంది. వీటి పట్ల కూడా మా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్, ఆన్ లైన్ యాప్స్, ఆన్ లైన్ రమ్మీ.. ఈ అంశంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటికి ప్రచారం
కల్పించిన వారిని పిలిపించి పోలీస్ స్టేషన్లలో విచారించారు. వాటికి ప్రచారం కల్పించిన వారిని పిలిచి పోలీస్ స్టేషన్ లో విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు.

Also Read : ఏపీలో పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతి కేసు ఇంత సంచలనంగా ఎందుకు మారింది? అసలేం జరుగుతోంది?

వీటిని నిర్వహించే వాళ్లు, ప్రమోట్ చేసే వాళ్లు, చివరికి ఈ యాడ్స్ ద్వారా లబ్ది పొందుతున్న వాళ్లను.. వీరందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలనే పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో కూడా విచారించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే పూర్తి స్థాయిలో అధికారులకు అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా సిట్ ను ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించినా, ప్రకటనలకు సహకరించినా, నిర్వహణలో భాగస్వాములు అయినా ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. ఈ రాష్ట్రంలో కచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల మేము కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నాము అని ఈ సభ ద్వారా సభ్యులకు చెప్పదలుచుకున్నా. తద్వారా అందరినీ కఠినంగా అణిచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.